ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన వివరాలను మార్చి 6 లోగా పొందుపర్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఎస్బీఐని ఆదేశించింది. కానీ ఎస్బీఐ ఇవ్వలేదు. జూన్ 30 వరకు గడువును కోరుతూ ఎస్బీఐ.. సుప్రీంకోర్టులో దరఖాస్తును దాఖలు చేసింది. ఇలాంటి తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. ఎస్బీఐ.. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పత్రాలను తన వెబ్సైట్ నుంచి తొలగించింది. ఎస్బీఐ చేసిన ఈ పని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
‘ఆపరేటింగ్ గైడ్లైన్స్ ఫర్ డోనర్స్’, ‘ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ (ఎఫ్ఏక్యూ)’ అనే పేరుతో ఉన్న లింక్లు, వెబ్పేజ్లు ఇప్పుడు ఎస్బీఐ వెబ్సైట్లో కనబడటం లేదు. ‘ఆపరేటింగ్ గైడ్లైన్స్ ఫర్ డోనర్స్’ అనే పత్రానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ 2018, జనవరి 2న విడుదలైంది. ఇప్పుడు వాటిని తొలగించారు. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నిలక సంఘానికి అందించటం కోసం ఎస్బీఐ మరో నాలుగు నెలల గడువును కోరుతోంది. ఇంత గడువు ఎందుకు … ఒక్క క్లిక్ తో వచ్చే సమాచారాన్ని ఇవ్వడానికి ఇబ్బందేమిటన్నది చాలా మందికి తెలిసిన విషయం.
షెడ్యూల్ ప్రకారం.. జూన్ లోపే ఎన్నికలు జరిగే అవకాశముంటుంది. ఆ లోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం బహిర్గతమైతే అధిక విరాళాలు అందుకున్న బీజేపీకి పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని అందుకే గడువు కోరుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ‘బలమైన శక్తుల’ ప్రోద్బలంతోనే ఎస్బీఐ గడువును జూన్ 30 వరకు కోరి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. సుప్రీంకోర్టు తీర్పునూ… పట్టించుకోని పరిస్థితి వస్తోంది.