ఎస్బీఐలో హోమ్ లోన్‌కు ధరఖాస్తు చేసుకుంటే ప్రాసెస్ పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుంది.? సిబిల్ స్కోర్ 800 దాటినా కనీసం రెండు నెలలు పడుతుంది.కానీ ఏపీ సర్కార్‌కు ఖచ్చితంగా వారం అంటే వారం రోజుల్లో రూ. 1500కోట్ల రుణం ఇచ్చేసింది ఎస్బీఐ. అదీ కూడా ఏపీ సర్కార్ కు తాకట్టు పెట్టడానికి.. గ్యారంటీ ఇవ్వడానికి ఏమీ లేకపోయినా ఔదార్యం చూపించింది. ఏపీ మారిటైమ్ బోర్డ్ అని ఇటీవల ఓ బోర్డును ఏర్పాటు చేశారు. ఆ బోర్డు పేరుతో అదానీకి పోర్టులు కట్టబెట్టేశారు. ఇప్పుడు ఆ బోర్డు పేరుతో ఏకంగా రూ. పదిహేను వందల కోట్ల అప్పు తెచ్చారు. ఆ అప్పుతో పోర్టులు కడతారా అని డౌట్ వస్తే ఖచ్చితంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై అవగాహనలేనట్లే.
వారం రోజుల కిందట కేంద్ర విద్యుత్ సంస్థల చైర్మన్లు వచ్చి అప్పు తీర్చాల్సిందేనని పీకల మీద కూర్చున్నారు. అప్పటికప్పుడు సలహాదారుగా నియమించుకున్న ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్‌తో.. నేరుగా ప్రస్తుత ఎస్బీఐ చైర్మన్‌తో మాట్లాడుకుని.. ఏ ఒప్పందం చేసుకున్నారో కానీ రూ. పదిహేను వందల కోట్ల రుణానికి అంగీకరింపచేశారు. ఆ రుణాన్ని మారిటైం బోర్డు పేరుతో తీసుకున్నారు. బ్యాంక్ నుంచి మారిటైం బోర్డు ఖాతాలోపడగానే.. వెంటనే ఆ నిధుల్ని కేంద్ర విద్యుత్ సంస్థల వాయిదాలకు చెల్లించేశారు. అసలు మారిటైం బోర్డుకు.. జెన్కోలు చెల్లించాల్సిన అప్పనకు సంబంధం ఏమిటి.. ఎందుకు తీసుకున్నారన్నది తర్వాత కథలో ప్రభుత్వం చెబుతుంది. మనం తెలుసుకుంటాం.
ఆర్థిక నిర్వహణ అత్యంత దారుణంగా ఉన్న ఏపీకి ఎస్బీఐ ఏ హామీ పెట్టుకుని రూ. పదిహేను వందల కోట్లు ఇచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంకుల తీరుపైనా అందుకే అనుమానాలు వస్తున్నాయి. ఎస్బీఐ క్యాప్స్ సంస్థకు ఇప్పటికే రుణాలు ఇప్పింటే బాధ్యతలు ఇచ్చి .. కమిషన్లు కట్టబెడుతున్నారు. ఇప్పుడు సలహాదారుకు ఈ రుణంలో ఎంత కమిషన్ ఇస్తున్నారో కానీ.. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికి దివాలానుంచి బయటపడింది. దీనికి ఎస్బీఐ సాయం చేసింది.