జీవీఎల్ నరిసింహారావు విశాఖ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇలా అనుకోవడం కూడా ప్రజాధనానికే చిల్లు పెడుతోంది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన జీవీఎల్ పదవి కాలం రెండు నెలల్లో ముగిసిపోతుంది. విశాఖపట్నంపై దృష్టి సారించి రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ విశాఖ పార్లమెంట్ పరిధిలో పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం స్పాన్సర్ షిప్ పేరుతో విశాఖలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.కోట్లు వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన విశాఖలో పరిశ్రమల అధిపతులతో నిత్యం సమావేశాలు, భేటీలు నిర్వహిస్తూ ‘కేంద్రం తనను ఏపీకికి దూతగా పంపింది’ అంటూ జివిఎల్ ప్రచారం చేసుకుంటున్నారు. బదిలీలు లాంటివి కావాలంటే చేసి పెడతామన్నట్లుగా బిల్డప్‌లు ఇస్తున్నారు. తాజాగా అలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సంక్రాంతి సంబరాల పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు పొందారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చింది. జీవీఎల్ సంక్రాంతి సంబరాల్లో ఎస్బీఐ స్పాన్సర్ షిప్ నేరుగా కనిపిస్తోంది. ఎస్‌బీఐపైనే కాకుండా మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలపైనా ఒత్తిడి తెచ్చి లక్షలాది రూపాయలు చందాల రూపంలో వసూలు చేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి సంబరాలకు అయ్యే సెట్టింగుల ఖర్చే రూ.60 లక్షల మేరకు ఉంటుందని తెలుస్తోంది. రోజూ కల్చరల్ కార్యక్రమాల పేర జబర్దస్త్ టీముల సందడి, పల్సర్ బైక్ ఝాన్సీ ఆటలు, సినీ తారలను 14న తీసుకొచ్చి ఆటా పాట ఏర్పాటు చేశారు. వీటి ఖర్చంతా ఎస్బీఐపై రుద్దినట్లు ప్రచారం జరుగుతోంది. హెచ్‌పిసిఎల్, హిందుస్థాన్ షిప్‌యార్డు, నేవల్ కమాండ్, స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీ సీఎమ్‌డీలు, ఎమ్‌డీలతో జీవీఎల్ పలు దఫాలు సమావేశమయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మహా సంక్రాంతి సంబరాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలపై ఆర్థిక భారాన్ని రుద్దినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీచ్ రోడ్డులో ఒక ఇంట్లో జివిఎల్ ఉంటూ పిఆర్‌ఒల వ్యవస్థ ద్వారా పలు కార్యకలాపాలు చేపడుతున్నారు. 2024 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున బరిలో దిగుతున్నట్లు ఇప్పటికే తనకు తానే ప్రకటించుకున్నారు. అయితే, పలువురు బీజేపీ సీనియర్ నాయకులు జివిఎల్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.