తీవ్రమైన నేరాభియోగాలున్న నేతలు ఎన్నికల్లో జీవిత కాలం పోటీ చేయకుండా చూడాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఇంతకు ముందే ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. రాష్ట్రాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న నేరారోపణ కేసుల జాబితాను… నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సమర్పించింది. దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్ట సభ సభ్యులపై 4 వేలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల విచారణ తమ ప్రాధాన్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నేరారోపణలు ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించాలన్న అంశంపై… వైఖరి తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సమాధానం తెలిపేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది. ఈ పిటిషన్లో జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. గతంలోనే ఈ అంశంపై హైకోర్టులో విచారణలు జరిగాయి. ఇప్పటికే శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం ఉంది. అయితే.. ఏళ్ల తరబడి విచారణలు జరుగుతున్నాయని నేరస్తులు ఇంకా చట్టసభలకు ఎన్నికవుతూనే ఉన్నారన్న నిట్టూర్పు ప్రజల నుంచి వస్తోంది.
ఈ క్రమంలో… తీవ్రమైన క్రిమినల్ నేరాలు చేసిన వారిని ఎన్నికలకు దూరం పెట్టాలన్న డిమాండ్ ప్రారంభమయింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ధర్మాసనాలు కూడా.. ఈ అంశంపై సీరియస్గా విచారణ జరిపాయి. అమికస్ క్యూరీని కూడా నియమించింది. అయితే.. కేంద్రం ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటే.. నేరగాళ్లు చట్టసభలకు ఎన్నికవకుండా ఉంటారు. కానీ కేంద్రం ఆలోచన ఎలా ఉందో ఆరు వారాల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.