కొంత మంది రాజకీయ నాయకులని కొన్ని కేసులు జీవితాంతం భూతంలాగ వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి తదితరుల పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. వీరి కేసుల పుణ్యామాని ఇప్పుడు సామాన్య ప్రజలకు సైతం ఎఫ్.ఐ.ఆర్.లు, కోర్టులు, పిటిషన్స్, విచారణలు, వాయిదాలు, బెయిలు వంటి చట్టపరమయిన విషయాల గురించి మంచి అవగాహన ఏర్పడిందని చెప్పవచ్చును.
విషయంలోకి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని అక్రమాస్తుల కేసులో ఆమెకు కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ళు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. కానీ కర్నాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించి, ఆ శిక్షలు రద్దు చేసి విడుదల చేసింది. కర్నాటక ప్రభుత్వం ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు పిటిషన్ వేయడంతో మళ్ళీ ఆమె న్యాయపోరాటం మొదలయింది.
కర్నాటక ప్రభుత్వం వేసిన ఆ పిటిషన్ని గురువారంనాడు విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు దానిని మళ్ళీ మార్చి 10కి వాయిదా వేసింది. కనుక మళ్ళీ అంతవరకు ఆమెకు తాత్కాలికంగా ఊరట లభించినట్లే. శుక్రవారంలోగా ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను, ఫైళ్ళను సమర్పించవలసిందిగా ఆమె తరపున వాదించిన న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒకపక్క జయలలితపై సుప్రీం కోర్టులో ఈకేసుపై విచారణ జరుగుతుంటే తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమయిన డిఎంకె పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆమె సమక్షంలో అన్నాడిఎంకె పార్టీలో చేరిపోయారు.