మహాత్మాగాంధీని నిందించడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. చరిత్రలో చేయని.. జరగని విషయాలను ఆయనకు ముడిపెడ్డి బూతులు తిట్టడానికి వెనుకాడటం లేదు. వైసీపీ నేత.. విక్టర్ ప్రసాద్ అదే చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అన్ని పార్టీల నేతలు దీన్ని ఖండించారు. జాతిపితపై ఇలాంటి నిందలు వేసి బూతులు తిట్టడం దేశద్రోహం అని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ వైసీపీ మాత్రం… తమ అధికారిక లాంగ్వేజ్ అదే కదా అన్నట్లుగా సైలెంట్ ఉంది.
అయితే విక్టర్ ప్రసాద్ తీరుపై పలు ప్రజాసంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే గాంధీని తమ వారిగా ఆర్యవైశ్య సంఘాలు భావిస్తున్నాయి కానీ.. ఆయనను జాతిపితగా పాలక వర్గం భావించడం లేదు. దీంతో గాంధీని ఒక వర్గానికి పరిమితం చేయడానికి ఈ వ్యవహారం సాగుతోందా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆర్యవైశ్య సంఘాలు అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు చేస్తున్నాయి. విక్టర్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మహాత్ముడిపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోయాయి. ఆయన సిద్ధాంతాలను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గొప్పతనాన్ని తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారు. ఏ దేశంలో అయినా జాతిపితకు ఇలాంటి అవమానాలు జరగవు. కానీ మన దగ్గర మాత్రం … స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత జాతిపితను అవమానించడం ఓ ఫ్యాషన్‌గా భావిస్తున్నారు.