సోము వీర్రాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్ గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎస్సీ కమిషన్‌కు రాజ్యాంగబద్ద అధికారాలు ఉంటాయి. అయితే విక్టర్ ప్రసాద్ ఈ ఆదేశాలు నోటి మాట ద్వారా ఇచ్చారా.. అధికారికంగా ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది. దీనికి కారణం ఓ దళితుడి భూమిని కబ్జా చేయడమేనని తెలుస్తోంది.
దళితుడైన వరప్రసాద్ అనే వ్యక్తి 2014లో మంగళగిరి మండలం చినకాకానికి చెందిన షేక్ మగ్భూల్ నుంచి 4404 చదరపు గజాలను కొనుగోలు చేశారు. అయితే సోము వీర్రాజు, లక్ష్మీపతి రాజా భూమి దగ్గర తమ మనుషులను పెట్టి వరప్రసాద్‌ను భూమిలోకి రానీయకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని వరప్రసాద్ ఆందోళన చేస్తున్నారు. భూములపై వివాదం ఉందని బీజెపి మీడియా కన్వీనరు లక్ష్మీపతి రాజా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కలిసి అయన అనుచరులతో వర ప్రసాద్ బెదిరించి తక్కువేక తమకు రాయించుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తుపాకీ చూపి భయభ్రాంతులకు గురిచేశారని వరప్రసాద్ ఆరోపిస్తున్నారు.
ఈ భూముల విషయంపై కొంత కాలంగా రచ్చ జరుగుతోంది. బీజేపీ ఆఫీసు కోసం వాటిని కొన్నారన్న ప్రచారం చేస్తున్నారు. కానీ సోము వీర్రాజు పేరు మీద నమోదు కావడం వివాదానికి కారణం అవుతోంది. ఎస్పీ కమిషన్ ఆదేశాలపై గుంటూరు ఎస్పీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.