దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా కమిషన్ ను ఏర్పాటు చేశారు. వీరు హైదరాబాద్ నుంచే విచారణ జరుపుతారు. తొలి విచారణ తేదీ విచారణ కమిషన్‌కి నేతృత్వం వహిస్తున్న వారి ఇష్టమేనని, ఆరు నెలల్లో దీనిపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కమిషన్‌ను ఆదేశించింది.
వీరికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ వివరాలను మీడియాకు లీక్ కాకుండా చూడాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతే కాదు.. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన జరుగుతున్న అన్ని రకాల దర్యాప్తులను ఆపాలని… ఈ కమిషన్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మాజీ అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహత్గి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకించారు.
ఎన్కౌంటర్ .. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతోందని, దానికి సమాంతరంగా విశ్రాంత న్యాయమూర్తి విచారణ ఎందుకని రోహత్గి అని ప్రశ్నించారు. రోహత్గి అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉందని సీజేఐ అన్నారు. మొత్తానికి దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై విచారణ ఆరు నెలల పాటు సాగే అవకాశం కనిపిస్తోంది.