విజయ్ మాల్యా కేసుపై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఆయనకి ఏప్రిల్ 21వరకు గడువిచ్చింది. ఆయన బ్యాంకులకు చెల్లించవలసిన రూ.9,000 కోట్లలో సెప్టెంబర్ నెలాఖరులోగా రెండు వాయిదాలలో మొత్తం రూ.4,000 కోట్లు జమా చేస్తానని ప్రతిపాదించారు. దానికి బ్యాంకులు అంగీకరించలేదు. తమకు చెల్లించవలసిన మొత్తం రూ.9,000 కోట్లు పూర్తిగా చెల్లించిన తరువాతనే ఆయనతో చర్చలకు అంగీకరిస్తామని బ్యాంకుల తరపున వాదించిన న్యాయవాదులు సుప్రీంకోర్టుకి తెలిపారు. విజయ్ మాల్యా తరపున వాదించిన న్యాయవాది అభ్యర్ధన మేరకు సుప్రీం కోర్టు ఆయనకి రెండు వారాలు గడువు ఇచ్చింది. ఆలోగా బ్యాంకులకి విజయ్ మాల్యా ఎంత మొత్తం చెల్లించేది తెలియజేయమని ఆదేశించింది.
విజయ్ మాల్యా 17 బ్యాంకులకి రూ.9,000 కోట్లు చెల్లించకుండా ఎగవేయాలనే ఉద్దేశ్యంతోనే విదేశానికి పారిపోయి, మోసం చేసాడని ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకి కూడా తెలుసు. పైగా బ్యాంకులు, ఈడి అధికారులు నోటీసులు పంపినా కూడా ఇప్పుడప్పుడే భారత్ తిరిగి వచ్చేది లేదని ధిక్కారంగా మాట్లాడుతున్నారు. బ్యాంకుల వద్ద చిన్నచిన్న రుణాలు తీసుకొన్న సామాన్యులు దానిని సకాలం తిరిగి చెల్లించలేకపోతే, బ్యాంకులు, న్యాయస్థానాలు వారిపట్ల ఎంతో కటినంగా వ్యవహరిస్తుంటాయి. కానీ విజయ్ మాల్యా వంటి ఆర్ధిక నేరస్థుడి పట్ల అంతకంటే చాలా కటినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, న్యాయస్థానమే ఇంత సౌమ్యంగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటువంటివి చూసినప్పుడే డబ్బున్న వాడికో నీతి లేని వాడికో నీతి అని అనిపిస్తుంది.