ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి సుప్రీం కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో సిబీఐ చేత ఆమెపై కొత్తగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి పునర్విచారణ చేయించాలని కోరుతూ వేయబడిన పిటిషన్ని సుప్రీం కోర్టు ఈరోజు విచారణకు స్వీకరించింది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగుల డిఏ విషయంలో అవినీతికి పాల్పడ్డారని, తాజ్ కారిడార్ వ్యవహారంలో ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి ఉన్న ఆమె ఆస్తులు, దానిపై కొన్నేళ్ళ క్రితం సిబీఐ దర్యాప్తు చేసి సమర్పించిన రికార్డుల ఆధారంగా మాయావతిపై కొత్తగా మరో ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేసి సిబీఐ చేత పునర్విచారణ చేయించాలని పిటిషనర్ కోరారు. ఆ అభ్యర్ధనను సుప్రీం కోర్టు మన్నించి విచారణకు స్వీకరించింది. క్రిందటి నెలలోనే ఆమెపై ఆ డి.ఏ. కేసు విచారణ మొదలయింది. ఆ కేసును సుప్రీం కోర్టు రేపు విచారణకు చేపట్టబోతోంది.
ఇదివరకు యూపియే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆమె పార్టీ మద్దతు పొందేందుకు ఆమెపై సిబీఐని ప్రయోగించి తాజ్ కారిడార్ అవినీతి భాగోతం వెలికి తీయించింది. ఆ కేసు భయంతోనే మాయావతి యూపియే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తూ వచ్చింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఆ ఎన్నికలలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బి.ఎస్.పి.తో పొత్తులు పెట్టుకోవాలని భాజపా ప్రయత్నిస్తోంది. బహుశః అందుకే ఆమెకు వ్యతిరేకంగా సిబీఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ సుప్రీం కోర్టు తెలిపినట్లున్నారు. అయితే ఈ కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది కనుక ఒకవేళ మళ్ళీ ఆమెపై ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేసి సిబీఐ చేత పునర్విచారణ చేయించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించినట్లయితే దానిని పాటించకతప్పదు. వచ్చే ఏడాది జరుగబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఆమెను నిలువరించేందుకే ఆమె రాజకీయ ప్రత్యర్ధులు ఎవరో ఈ పిటిషన్ వేసి ఉండవచ్చును.