స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పోలీసులు విచారణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు.. ఎఫ్ఐఆర్పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అయితే ఈ విషయంలో డాక్టర్ రమేష్‌కు కూడా స్వల్ప ఊరట లభించింది. ఆయనపై నిర్బంధ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. డాక్టర్ రమేష్ కూడా విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను రమేష్ ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా చికిత్స కేంద్రంగా వినియోగిస్తోంది. అంతకు ముందు ఈ ఆస్పత్రిని ప్రభుత్వం కూడా క్వారంటైన్ సెంటర్ గా వినియోగించింది.
అయితే అగ్నిప్రమాదం జరిగి పది మంది మృతి చెందడంతో తప్పు అంతా రమేష్ ఆస్పత్రి యాజమాన్యానిదేనని ప్రభుత్వం నిర్ధారించి ముగ్గురు వైద్యులను అరెస్ట్ చేసింది. ఆస్పత్రి చైర్మన్, ఎండీలను అరెస్ట్ చేయడానికి పోలీసులు వేట సాగించారు. వారిని పట్టిచ్చిన వారికి లక్ష బహుమానం ప్రకటించారు. అయితే ఈ కేసులో వారు క్వాష్ పిటిషన్ వేయడంతో.. హైకోర్టు మౌలికమైన ప్రశ్నలను ప్రభుత్వ న్యాయవాది ముందు ఉంచారు. అనుమతులు ఇచ్చిన వారిని ముందుగా బాధ్యులను చేయాల్సిఉంటుందని వ్యాఖ్యానిస్తూ ఎఫ్ఐఆర్పై స్టే విధించింది.
అయితే ప్రభుత్వం మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ నిర్వహించాలన్న పట్టుదలతో సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసును దర్యాప్తు చేయడానికి అవకాశం ఇచ్చింది. అదే సమయంలో నిర్బంధం అవసరం లేదని వ్యాఖ్యానించింది కాబట్టి… రమేష్ ను అరెస్ట్ చేయడానికి కూడా అవకాశాల్లేవని న్యాయనిపుణులు చెబుతున్నారు.