వైకాపా ఎమ్మెల్యే రోజా శాసనసభ హక్కుల కమిటీ ముందు హాజరయ్యి తెదేపా ఎమ్మెల్యే అనితపై తను చేసిన వ్యాఖ్యలు ఆమెను నొప్పించి ఉంటే, వాటిని ఉపసంహరించుకొంటున్నానని చెప్పి క్షమాపణ కోరకుండా ఊహించని ట్విస్ట్ ఇచ్చేరు. ఆమె చెప్పిన సమాధానంపై కమిటీ సభ్యులు ఇంకా ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. కనుక ఆమెపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయమని సిఫార్సు చేస్తారో లేక కొనసాగించమని కోరుతారో ఇంకా తెలియదు.
ఈలోగా ఊహించని మరో పరిణామం జరిగింది. శాసనసభ హక్కుల కమిటీ ముందు రోజా హాజరయ్యి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్లు చెప్పారు కనుక ఈ అంతులేని కధకు ఇంకా ముగింపు వచ్చినట్లేనని అందరూ భావిస్తున్న సమయంలో ఈ వ్యవహారంపై సంజాయిషీ కోరుతూ సుప్రీం కోర్టు ఇవ్వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసు జారీ చేయడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. ఆమె పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించడాన్ని ఏవిధంగా సమర్ధించుకొంటారో ఈనెల 21లోగా తెలపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు నోటీసు పంపింది.
రోజా మొదట హైకోర్టు సింగిల్ జడ్జ్ కోర్టుని ఆశ్రయించగా, ఆమెపై విధించిన సస్పెన్షన్ పై స్టే విధించి, శాసనసభకు హాజరయ్యేందుకు అనుమతించారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాలు చేయగా, సింగల్ జడ్జ్ తీర్పును పక్కనపెడుతూ తీర్పు చెప్పింది. రోజా మళ్ళీ ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సంజాయిషీతో సుప్రీం కోర్టు సంతృప్తి చెందకపోయినట్లయితే, రోజాపై విధించిన సస్పెన్షన్ పై మళ్ళీ స్టే విదించవచ్చును లేదా రద్దు చేయవచ్చును. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. కనుక ఈలోగానే రోజాపై విధించిన సస్పెన్షన్ రద్దు చేస్తుందేమో?