బీమా కోరేగామ్ హింసాత్మక ఘటన కేసుకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురునీ గృహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వరవరరావుతోపాటు గౌతమ్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్రన్ గొంజాల్వేజ్ లను ఎవరి ఇళ్లలో వారిని గృహ నిర్బంధంలోనే వచ్చే నెల 6 వరకూ ఉంచాలనీ, జైల్లో నిర్బంధించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వీరిని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5లోగా ఈ నోటీసులపై మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్రం కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ సందర్బంగా సుప్రీం కోర్టు జడ్జి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సేఫ్టీ వాల్వ్ లేకుంటే ప్రెషర్ కుక్కర్ పేలిపోతుందనీ, అలాగే ప్రజాస్వామ్యంలో నిరసన అనేది సేఫ్టీ వాల్వ్ లాంటిదనీ ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఐదుగురిలో ఇద్దరు ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉన్నారు. మిగిలినవారిని కూడా అదే తరహాలో వారి స్వస్థలాలకు తలరించాలని కోర్టు చెప్పింది. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపిస్తూ… నిందితులతో పరిచయం లేనివాళ్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారనీ, ఇది ఆశ్చర్యకరమైన కేసు అంటూ కోర్టులో వాదించారు.
దీంతో ఈ ఐదుగురికీ కొంత ఊరట లభించిందనే చెప్పొచ్చు. అయితే, గృహ నిర్బంధంలో ఉంచడం వల్ల వీరు ఇంటి నాలుగు గోడలు దాటి బయటకి వెళ్లలేని పరిస్థితి. కానీ, బయటకి వారు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంట్లో వారు స్వేచ్ఛగా ఉండేందుకు కూడా పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇక, ఈ కేసు విషయమై తమ దగ్గర బలమైన సాక్షాధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. కోర్టు ఇచ్చిన గడువులోగా వాటిని పోలీసులు సమర్పించాల్సి ఉంటుంది. మరి, మహారాష్ట్రతోపాటు కోర్టు ముందు కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.