కర్ణాటక రాజకీయ పరిణామాలకు సాయంత్రం తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ఆరు గంటల లోపు… ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో.. ఎమ్మెల్యేలంతా.. స్పీకర్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. తమ రాజీనామాలను కావాలనే స్పీకర్ ఆమోదించడం లేదని ఆరోపిస్తూ… రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సాయంత్రం ఆరు గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరో వైపు స్పీకర్ మాత్రం.. ఎమ్మెల్యేలందరికీ ఒక్కో సమయం కేటాయించారు. పదిహేడో తేదీ వరకు.. వివిధ రెబల్ ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో… ఈ రోజే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరూ… స్పీకర్ ఎదుట హాజరు కావాలని… సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. కర్ణాటకలో సాయంత్రం.. హై వోల్టేజ్ రాజకీయాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరికీ అందుబాటులో లేరు. ముంబై, పుణెల్లో క్యాంపుల్లో ఉన్నారు. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వారిని కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారు కలవడానికి సిద్దపడలేదు. వారిని కలిసిన తర్వాతే వెళ్తానని.. శివకుమార్ పట్టుబట్టినా సాధ్యం కాలేదు. ఇప్పుడు.. వారే నేరుగా… అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌కు రానున్నారు. దాంతోనే..అటు.. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు.. ఇటు… వారిని రాజీనామాలకు కట్టుబడి ఉండేలా చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడం ఖాయమే. దాంతో.. అసెంబ్లీ వేదికగా… రాజకీయ డ్రామా ఖాయంగా కనిపిస్తోంది.
ఒక వేళ ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సిద్ధపడితే… స్పీకర్‌కు రాజీనామాలు ఆమోదించడం మినహా మరో మార్గంలేదు. ఫార్మాట్లో లేవని తాత్కలికంగా తిరస్కరించవచ్చేమో కానీ.. ఫార్మాట్లో ఇస్తే మాత్రం.. కచ్చితంగా ఆమోదించి తీరాల్సిందే. మామూలుగా అయితే.. స్పీకర్‌కు ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. అయితే.. ఇప్పుడు సుప్రీంకోర్టు గడువు ఇచ్చినందున.. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి సాయంత్రానికి ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో.. తేలిపోతుంది.