హైదరాబాద్: దీపావళినాడు బాణాసంచా కాల్చటంవలన తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతుందని, వాటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్పై సుప్రీంకోర్ట్ ఇవాళ తీర్పు వెలువరించింది. దీపావళినాడు టపాసులు కాల్చకుండా నిషేధించటం సాధ్యమయ్యే పనికాదంటూ ఆ పిటిషన్ను కొట్టిపారేసింది. అయితే వీటిని రాత్రి 10 గంటలు-ఉదయం 6 గంటలకు మధ్య కాల్చకూడదన్న తమ గత ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్ను కౌంటర్ చేస్తూ, తమిళనాడు ఫైర్ వర్క్స్ మ్యాన్యుఫేక్చరర్స్ అసోసియేషన్తో సహా వివిధ హిందూ సంస్థలు పిటిషన్లను దాఖలు చేశాయి. బాణాసంచా అనేది దీపావళి సంబరాలలో ఒక భాగమని, దీపాలు, టపాసులు దీపావళి పండుగకు ప్రతీక అని పేర్కొన్నాయి. తమిళనాడులోని శివకాశిలోని 350 బాణాసంచా ఫ్యాక్టరీలలో రు.1,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపాయి. ఈ పరిశ్రమలవలన 3 లక్షలమందికిపైగా ఉపాధి లభిస్తోందని, 10 లక్షలమందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని పేర్కొన్నాయి. నిషేధం విధిస్తే వీరందరూ రోడ్డున పడాల్సివస్తుందని వాదించాయి.