దేశవ్యాప్తంగా వైద్య విద్యాకోర్సులలో ప్రవేశం కోసం అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా నీట్ ఉమ్మడి పరీక్షనే తప్పనిసరిగా అమలుచేయాలని సుప్రీం కోర్టు కొద్ది సేపటి క్రితం తీర్పు వెలువరించింది. రాష్ట్రాల కోసం వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అందుకోసం అవసరమయితే నీట్-2 ఉమ్మడి పరీక్షల తేదీని మార్చుకోవచ్చని సూచించింది. ఇప్పటికే నీట్-1 వ్రాసిన విద్యార్ధులు కూడా మళ్ళీ వ్రాయవచ్చని, అయితే వారు తమ అభ్యర్ధిత్వాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఒకే పద్దతిలో నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించడం వలన రాష్ట్రాల హక్కులకు, మైనార్టీల హక్కులకు భంగం కలగదని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. నీట్ పర్యవేక్షణ కోసం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సుప్రీం కోర్టు తన తీర్పులో తెలిపింది. నీట్- పరీక్షలు జూలై 24న జరుగవలసి ఉంది.
సుప్రీం కోర్టు తన తీర్పు వెలువరించిన కొన్ని నిమిషాలకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను మాత్రమే వెలువరిచింది. వైద్య కోర్సులలో ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పులో ఇంకా స్పష్టత ఏర్పడకపోవడంతో దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తరువాతే తగిన నిర్ణయం తీసుకొంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకి తెలిపారు.