ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. అ కేసులో నాల్గవ నిందితుడుగా పేర్కొనబడిన జెరూసలేం మత్తయ్యకి సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఆ కేసు నుంచి ఆయనకి హైకోర్టు విముక్తి కల్పించడంతో అప్రమత్తమయిన తెలంగాణా ఎసిబి, హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ కొన్ని రోజుల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిని విచారణకి స్వీకరించిన సుప్రీం కోర్టు మత్తయ్యని నాలుగు వారాలలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
ఈ కేసుకి తెలంగాణా ప్రభుత్వం చాలా రోజులుగా బ్రేకులు వేసి ముందుకి కదలకుండా నిలిపి ఉంచినప్పటికీ, దానిని పూర్తిగా వదిలిపెట్టదలచుకోలేదని ఇది రుజువు చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రభుత్వంపై నిత్యం తీవ్ర విమర్శలు చేస్తూ, చాలా ఇబ్బందిపెడుతున్నారు. అలాగే ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా దెబ్బ తీయగల అవకాశం ఉంది. కనుక ఒకవేళ మున్ముందు ఎప్పుడైనా అవసరం పడితే, ఈ కేసుని వారిరువురిపై బ్రహ్మాస్త్రంలాగ ప్రయోగించవచ్చుననే ఆలోచనతోనే తెలంగాణా ప్రభుత్వం ఈ కేసుని పూర్తిగా వదులుకోవడానికి ఇష్టపడటం లేదని భావించవచ్చు. అయితే ఈకేసులో మత్తయ్యకి సుప్రీం కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఆయనకి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. ఈ ఓటుకి నోటు కేసు చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి పక్కలో ఎప్పటికీ అభద్రతాభావం కలిగిస్తూనే ఉండవచ్చు.