వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత .. అసలు ఐదేళ్లలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించి.. ఎక్కడ తప్పులుంటే అక్కడ కేసులు పెట్టాలని ఓ సిట్‌ను ప్రభుత్వం నియమించింది. ఆ సిట్‌కు పోలీస్ స్టేషన్ అధికారాలు ఇచ్చింది. అయితే ఎక్కడైనా నేరం జరిగినట్లుగా సాక్ష్యాలు లభిస్తే.. సిట్ వేయడం రాజ్యాంగపరంగా సాధ్యం కానీ.. ఇలా అసలు నేరం ఉందో లేదో వెదికి మరీ కేసులు పెట్టడానికి సిట్ ఏర్పాటు చేయడం ఏమిటని.. కావాలని తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్ర పన్నారని టీడీపీ కోర్టులకు వెళ్లింది. హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలా స్టే ఇవ్వడం కరెక్ట్ కాదని వాదిస్తూ..ఆ స్టే ఎత్తేశారు. అయితే సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్ ప్రాతిప్రదికన ఈ కేసును విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు ధర్మాసనం సూచించింది. అంటే మళ్లీ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
సిట్ ఏర్పాటుపై స్టే పోయింది కాబట్టి ఇక చంద్రబాబు సంగతి చూస్తామని మంత్రి జోగి రమేష్ ప్రకటించేశారు. చంద్రబాబును త్వరలో అరెస్ట్ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఆ సిట్ చేయాల్సిన పనిని సీఐడీతో ఎప్పుడో చేయించేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వ అవకతవకలు అంటూ … ఉన్నా లేకపోయినా ఎక్కడ కేసులు పెట్టాలో అన్ని చోట్లా పెట్టించింది. అమరావతి భూముల దగ్గర్నుంచి .. స్కిల్ డెలవప్మెంట్ స్కాం అంటూ చాలా కేసులు పెట్టారు. ఈఎస్ఐ స్కాం అంటూ అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. ఏ ఒక్క దాంట్లోనూ సాక్ష్యం చూపించలేక కనీసం చార్జిషీట్లు కూడా వేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా సిట్ విచారణ ప్రారంభించినా చేయగలిగిందేమీ లేదు.
వైసీపీ నేతలకు ఈ విషయం తెలియనిది కాదు. కానీ నాలుగేళ్లు గడిచినా ఇంకా చంద్రబాబు ప్రభుత్వంలో ఏం అవినీతి జరిగిందో చెప్పలేక.. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఎత్తివేసిందంటూ హడావుడి చేస్తున్నారు. అమరావతి భూముల కేసుల్లో పెట్టగలిగినన్ని కేసులు పెట్టారు.అన్నీ కోర్టుల్లోఉన్నాయి. కానీ ఈ సిట్ పై వచ్చిన తీర్పు రేపు.. ప్రభుత్వం మారితే.. వైసీపీకే చుట్టుకునే చాన్స్ ఉంది. ప్రభుత్వం మారగానే సిట్ వేసి.. చేయాలనుకున్నది చేసేస్తుంది. అప్పుడు కోర్టుకెళ్లడానికి చాన్స్ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలే ఉన్నాయి మరి !