అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించి, ఆమెకి ప్రత్యేక కోర్టు విదించిన నాలుగేళ్ళ జైలు శిక్షని, రూ.100 కోట్ల జరిమానాని కర్ణాటక హైకోర్టు కొట్టివేయడం ఆ తరువాత ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ కొన్ని రోజుల క్రితం ఒక పిటిషన్ వేసింది. దానిని ఈరోజు విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఆ కేసును ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. దీనితో ఆమె మళ్ళీ మరో సుదీర్గ న్యాయపోరాటానికి సిద్దం కావలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇటువంటి కేసులు వేయడంలో చాలా సుప్రసిద్దుడని పేరు పొందిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుమారు పదిహేనేళ్ళ క్రితం ఆమెపై ఈ కేసు వేశారు. అప్పటి నుండి సుదీర్గకాలం దీనిపై విచారణ జరిగిన తరువాత క్రిందటి సంవత్సరమే కర్నాటక హైకోర్టు ఆమెకు ఆ కేసు నుండి విముక్తి కల్పించింది. కానీ కర్ణాటక ప్రభుత్వం మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళడంతో జయలలితకు మళ్ళీ కొత్త కష్టాలు మొదలయ్యాయి.
ఈ ఏడాది మే-జూన్ నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ సమయంలో సుప్రీం కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించడం వలన ఆమెకు రాజకీయంగా కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నాలుగయిదు నెలల వ్యవధిలో సుప్రీం కోర్టు కూడా కర్ణాటక హైకోర్టు తీర్పునే సమర్దించి ఆమెను నిర్దోషిగా ప్రకటించినట్లయితే ఇక ఈ ఎన్నికలలో అన్నాడిఎంకె పార్టీ గెలుపు తధ్యమని భావించవచ్చును. బహుశః అందుకు ఆమె మోడీ ప్రభుత్వ సహాకారం అవసరం ఉంటుంది. బీజేపీ కూడా తమిళనాడులో నిలద్రొక్కుకోవడానికి ఆమె చుట్టూ చాలా కాలంగా ప్రదక్షిణాలు చేస్తోంది.
ఇటీవల చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తినప్పుడు ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా చెన్నై వెళ్లి ఆమెను కలిసి, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి వచ్చేరు. ఆ హామీని నిలబెట్టుకొంటూ తక్షణమే భారీగా నిధులు, సహాయపునరావాస చర్యలకు అవసరమయిన ఏర్పాట్లు చేసారు. అదే విశాఖలో హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు కూడా మోడీ వచ్చి పర్యటించిన తరువాత రూ.1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దానిని తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ చుట్టూ ఆరు నెలలపాటు కాళ్ళు అరిగిపోయేలా తిరగవలసి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రప్రభుత్వం చూపించిన ఈ తేడాను గమనించినట్లయితే, జయలలితని ప్రసన్నం చేసుకొని ఆమె పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నిస్తోందో అర్ధం చేసుకోవచ్చును.
కనుక బీజేపీతో పొత్తులకు ఆమె సిద్దపడినట్లయితే, ఈ కేసు నుంచి చాలా తేలికగా, శాస్వితంగా బయటపడేందుకు కేంద్రప్రభుత్వం కూడా ఆమెకు సహకరించవచ్చును. ఆ రెండు పార్టీల మధ్య రానున్న రోజుల్లో బంధం ఏర్పడినట్లయితే అదే ఈ కేసు నుంచి ఆమె తప్పకుండా బయటపడతారని చెప్పడానికి తొలి సంకేతంగా భావించవచ్చును.