వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని ఆక్షేపించింది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
వివేకా హత్యపై మాట్లాడుతున్నారంటూ వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పిటిషన్ వేయగానే.. ఎవరూ మాట్లాడవద్దంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చేసింది. కనీసం నోటీసులు కూడా ప్రతివాదులకు ఇవ్వలేదు. ఇదేం పద్దతని.. రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని కూడా కోర్టులు ఇలా ఆపేస్తాయా అని గగ్గోలు పెట్టిన షర్మిల, సునీత హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టుకు కూడా ఇవేం ఆదేశాలు అనిపించలేదు. సామాన్యులకు కూడా ఇలాంటి ఆదేశాలు విచిత్రంగా ఉంటాయి. కింది కోర్టులోనే తేల్చుకోవాలని పంపింది. కింది కోర్టు హైకోర్టుకు వెళ్తారా అన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేసి…పిటిషన్ కొట్టేయడమే కాక పది వేల జరిమానా కూడా విధించింది.
చివరికి రాజ్యాంగం ప్రసాదించిన తమ ప్రాథమిక హక్కుల్ని కాపాడాలని సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు కడప కోర్టు తీర్పు పై స్టే విధించింది. ఈ అంశంపై నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులపై కూడా స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతారు.