నేర చరిత్ర ఉన్న వారిని.. క్రిమినల్ మైండ్స్ ఉన్న వారిని గొప్పగా చూసే పాలకులు ఉన్న చోట్ల పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో ఏపీనే పెద్ద ఉదాహరణ. గతంలో ఏపీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కనీసం వంద కోట్ల వరకూ దొంగ చెక్కులతో డ్రా చేసుకునే ప్రయత్నం జరిగింది. దొంగలెవరో కనిపెట్టడానికి ఆసక్తి చూపించలేదు. ఎంత దోపిడీకి గురయ్యాయో కూడాతెలియదు. ఇప్పుడు మరింత ముందుకు ముందు ఏపీ సీఎంవోలో ఓ అటెండర్… అందరి పాస్ వర్డ్లతో లాగిన్ అయిపోయి ఎవరికీ తెలియకుండా ఉత్తర్వులు ఇచ్చేశారట. సీఎంవో లాగిన్ నుంచి ఉత్తర్వులు అంటే.. సీఎం ఉత్తర్వులు ఇచ్చినట్లే.
ఏపీ సీఎంవో లో అనుమతి పొందాల్సిన ఫైల్స్ ‘ఈ-ఫైలింగ్’ ద్వారా సీఎంవోకి చేరుతారు. వాటిని పరిశీలించి సీఎం అనుమతితో పేషీ నుంచి ఉత్తర్వులు జారీ అవుతాయి. దీని కోసం సీఎంవో అధికారులు లాగిన్ అయి, డిజిటల్ సైన్ చేయాలి. అయితే ఇప్పుడు వారికి తెలియకుండా … వందల సంఖ్యలో అప్రూవల్స్ అయ్యాయి. ఈ విషయం బయటపడేసరికి అధికారులు కంగారుపడిపోయారు. పోలీసులు కేసులు పెట్టి ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు చిరు ఉద్యోగులు, అటెండర్లు, సీఎంవోలో లాగిన్, పాస్ వర్డ్లను తెలుసుకుని… అప్రూవల్స్ ఇవ్వడం వారి వల్ల అవుతుందా అంటే… ఖచ్చితంగా ఏదో పెద్ద తలకాయ వ్యవహారం ఉండే ఉంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. ఉంది కూడా…కానీ గుట్టుచప్పుడు కాకుండా చిన్న వాళ్లను బలి చేసి… పెద్దల్ని తప్పించేస్తున్నారు.
సీఎం పేషీలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి బందువు ఈ వ్యవహరం మొత్తానికి సూత్రధారి అని చెబుతున్నారు. ఓ చిన్న ఉద్యోగి సాయంతో మొత్తం వ్యవహారాన్ని నడిపారారని.. అప్రూవల్స్ కోసం కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే పరువు పోతుందని… సైలెంట్ గా ఉంటున్నారు . చిన్న కేసులతో సరి పెడుతున్నారని అంటున్నారు. నిజానికి అసలు ఏకంగా సీఎం అప్రూవల్స్ ను అటెండర్ ఇచ్చేయడం అంటే… సీఎంవోను హైజాక్ చేయడమేనని.. ఇలాంటి దారుణమైన గవర్నెన్స్ ఎక్కడ ఉంటుందన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.