చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే… నకిలీ చెక్కులు.. నకిలీ బిల్లులతో దోచుకోవడానికే అన్నట్లుగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క సారే రూ. 117కోట్లు కొల్లగొట్టడానికి మూడు ఫోర్జరీ చెక్‌లు వేసిన విషయం బయటపడటంతో.. ఈ మొత్తం వ్యవహారం తీగ లాగడం ప్రారంభించారు. అందులో ఒక్కోటి బయటకు వస్తోంది. ఇప్పటికే కొన్ని చెక్కులు డ్రా చేసుకున్నానంటూ.. ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి లొంగిపోయాడు. కానీ.. అక్కడి నుంచి అంతకు మించి పెద్ద స్కాం జరిగిందని తాజాగాఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున నకిలీ ఆస్పత్రి బిల్లులు…. నకిలీ క్లెయిమ్‌లతో.. సీఎంఆర్ఎఫ్కు వినతులు వచ్చాయి. వాటిని క్రాస్ చెక్ చేయకుండానే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా.. విచారణలో బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
రూ. 117 కోట్లు నొక్కేయాలనుకున్నదెవరో.. పోలీసులు తేల్చే పనిలో పడ్డారు. ఆ చెక్కులు వేసిన వ్యక్తుల్ని పట్టుకున్నారు. వారు ఎవరితో లావాదేవీలు నిర్వహించారు.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు వారికి ఎలా వెళ్లాయి… వంటి వాటిపై లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఆ మూలాలు ప్రొద్దుటూరు వైపు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అక్రమాలన్నీ బయటపడుతూండటంతో… ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన ప్రారంభమయింది. సీఎంఆర్ఎఫ్ ఫండ్ పూర్తిగా సీఎం విచక్షణ మేరకు వినియోగిస్తారు. ఇప్పుడు ఆయన అధీనంలో ఉండే ఫండ్కే గ్యారంటీ లేకపోవడం… స్కాం జరిగిందని తేలడంతో.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఎంత వారున్నా వదిలి పెట్టకుండా.. ప్రతీ పైసా పారదర్శకంగా వినియోగం అయిందని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ స్కాం విస్తృతి పెరుగుతోంది. దొరికిన దొంగలు కాకుండా.. దొరకకుండా ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున చెక్కులు డ్రా చేసుకున్న వారి వివరాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీతో పాటు ఎస్ఈబీ కూడా ఈ స్కాంపై దర్యాప్తు చేస్తున్నాయి. వీరిపై కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే..స్కాంలో ఇప్పటికే తీగ లాగడం ప్రారంభమయిందని.. అది ఎవరి దగ్గర తేలుతుందో అంచనా వేయడం కష్టమని.. అంచనా వేస్తున్నారు.