రుషికొండ ప్యాలెస్ ను ప్రజల ముందు పెట్టింది ప్రభుత్వం. ఇందులో ఉన్న లగ్జరీల గురించి చెప్పాల్సిన పని లేదు. కొండ చరియలు విరిగిపడకుండా జపాన్ టెక్నాలజీ వాడారారని చంద్రబాబు అంటే.. జగన్ ను పొగిడారని వైసీపీ నేతలు అంటున్నారు. దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఉందని ఆయన ఆశ్చర్యపోయారు. అసలు రూ. 500 కోట్లు ఖర్చు పెట్టేంత ఆ ప్యాలెస్ లో ఏముందో చాలా మందికి అర్థం కావడం లేదు. ఒక్క ఫ్యాన్ నాలుగు లక్షలకు కొన్నారని అంటున్నారు. రూ. యాభై లక్షలకు బెడ్ కొన్నారని చెబుతున్నారు.
ఇలా ప్యాలెస్లో మొత్తం లక్షలకు లక్షలు కొన్నారని చెబుతున్నారు. ఎన్ని కొన్నా రూ. ఐదు వందల కోట్లు ఎలా అవుతాయన్నది మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఇందులో కమిషన్ల కోసం రూ. మూడు వందల కోట్లు మింగేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైవ్ స్టార్ సౌకర్యాలతో హోటల్ నిర్మిస్తే ప్రతి గదికి లగ్జరీ మంచం సహా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ప్యాలెస్లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే అంత పెద్ద మొత్తంలో ఎలా ఖర్చు పెట్టారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
ఈ మొత్తం ఖర్చుపై ఆడిట్ చేయించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. కాంట్రాక్టర్లు ఎవరు.. వారికి ఇచ్చిన పనులేంటి.. చేసిన పనులేంటి… వసూలు చేసిన డబ్బులెంత లాంటివన్నీ విచారణ చేయించాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. మొత్తం నిర్మాణ ఖర్చును ఆరా తీసి.. మొత్తం దేనికెంత ఖర్చు పెట్టారో ప్రజల ముందు ఉంచాలన్న భావన వినిపిస్తోంది.