పాతబస్తీలో మజ్లిస్ పార్టీ దుందుడుకు పోకడలతో స్వైరవిహారం చేసింది. తమకు కిట్టని వారు ఏ పార్టీ వారనే అంశాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఎవరు దొరికితే వారిని చితక్కొట్టింది. తాము కొట్టగలం గనుక కొడతాం.. ఇతరు దెబ్బలు తినాల్సిందే అన్నట్లుగా వారి ధోరణి సాగిపోయింది. పోలీసులు మేం చూడగలం తప్ప ఆపలేం అన్నట్లుగా తమ నిర్లిప్తతను ప్రదర్శించారు. హైదరాబాదు నగరంలో- మజ్లిస్ పార్టీ లేదా ఎవరైనా కండబలం ప్రదర్శించగల గూండాలు చెలరేగితే శాంతి భద్రతలు అనేవి ఎంత డొల్ల పరిస్థితిలో ఉన్నాయో ఈ సంఘటనలు కళ్లకు కట్టినట్లు నిరూపించాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వారి దూకుడు మీద దాడులకు గురైన వారిలో కీలక నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి చర్యలకు డిమాండ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ప్రతినిధులు మాత్రం ఎవ్వరూ హాజరు కాకపోవడం విశేషం. నిజానికి తాము మజ్లిస్ మద్దతు తీసుకునే ఉద్దేశంతో ఉన్నామే తప్ప.. ఆ పార్టీకి గులాములుగా మాత్రం లేము అని నిరూపించుకోవడానికి ఈ అఖిలపక్ష సమావేశం అనేది తెరాసకు ఒక చక్కటి అవకాశం లాగా చెప్పుకోవాలి. కానీ.. ఆ పార్టీకి చెందిన ప్రతినిధులు ఎవ్వరూ కూడా స్వయంగా తమ పార్టీ వారు దాడులకు గురైనప్పటికీ కూడా సమావేశానికి మాత్రం రాలేదు. తెరాసకు మజ్లిస్‌తో రాజకీయ ప్రయోజనం ఉన్నది గనుక.. ఆశిస్తున్నారు గనుక.. రాలేదు అనుకోవచ్చు…
కానీ, చివరికి వామపక్షాలు, లోక్‌సత్తా వంటి పార్టీల వారు కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి రాకపోవడం విశేషం. మజ్లిస్ కు వ్యతిరేకంగా, వారి అరాచకపోకడలకు వ్యతిరేకంగా నలుగురిలో నిలబడి మాట్లాడడానికి కూడా ఈ పార్టీలు భయపడుతున్నాయా అనిపిస్తోంది. వామపక్షాలు ఎన్నికల సమయంలో మజ్లిస్ మీద బాగానే విమర్శలు చేశాయి. అయితే జరిగిన దాడుల మీద అందరూ సంఘీభావం ప్రకటించాల్సి ఉండగా.. ఆ పని చేయడానికి మాత్రం వారు ముందుకు రాలేదు. ఆదర్శ రాజకీయాల గురించి మాట్లాడే లోక్‌సత్తా ఒక రాజకీయ అనైతిక పోకడలకు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి ఎందుకు దూరం ఉన్నదో తెలియదు.
మొత్తానికి మజ్లిస్ అరాచకాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి పార్టీల మధ్య ఇలా ఐక్యత లేకపోతే.. వారికి అడ్డూ అదుపూ ఉండదని జనం భావిస్తున్నారు.