గత పదిహేను రోజులుగా ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ మొదలైన తర్వాత రాజకీయ చర్చ మీడియా ఫోకస్ మొత్తం తెలంగాణపైకి మరలింది. అంతకు ముందు ఎపి విషయాలపై వివాదాలు విమర్శలు ఎక్కువగా కనిపిస్తుండేవి. కాని ఈ రెండు వారాలలోనూ జగన్ పాదయాత్ర, కోర్టు తీర్పుల, చంద్రబాబు విదేశీ యాత్రలు, జిల్లాలలో రభసలు ఏవీ ప్రాధాన్యత నోచుకోవడం లేదు.పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం తెరవడం, ప్లీనరీల నిర్వహణకు నిర్ణయం తీసుకోవడం కూడా మామూలుగా పొందే ప్రచారం పొందలేదు. చంద్రబాబు తిరిగివచ్చిన తర్వాత జరిపిన సమావేశాలలోనూ ఇదే ప్రధానాంశమై కూచుంది.మరో వైపున రెండు రాష్ట్రాలన్న తేడా వెనక్కు పోయి టిడిపి టిఆర్ఎస్ల రాజకీయ సర్దుబాటుగా తయారైంది. నిజానికి కెసిఆర్ అనంతపురం యాత్ర నుంచి ఒక్కసారిగా పాత రోజుల్లో వలె రెండు రాష్ట్రాలనూ కలిపి చర్చించడం, హైదరాబాదులో ఎపి నేతలు అమరావతిలో తెలంగాణ నేతలు మాట్లాడ్డం వంటివి జరిగాయి. చంద్రబాబు హైదరాబాదు రాకలు రాజకీయాలు కూడా పెరిగాయి. అయితే ఇదంతా కూడా ఒకరినొకరు ఇముడ్చుకునే ప్రయత్నంగా తప్ప గతంలో వలె రెండు పాలకపక్షాలూ కీచులాడుకోవడం లేదు.చెప్పాలంటే కావాలనే మాట్లాడకుండా పరిణామాలు జరిగిపోవాలని చూస్తున్నారనిపిస్తుంది. ఇదంతా రేవంత్ నిర్ణయం వల్ల జరిగిందనుకుంటే పొరబాటే. ఇలా మారబోతుంది గనకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్నది అసలు విషయం.