మారుతి – దిల్‌రాజు అనే ఇంట్రస్టింగ్ కాంబో నుంచి వచ్చిన సినిమా రోజులు మారాయి. విమర్శకులు ఈ సినిమాని ఏకి పరేశారు. ఏదో ఉందిలే.. అనుకొని థియేటర్‌కి వెళ్లిన ఆడియన్స్ నిరాశగా వెనుదిరిగారు. ఈ సినిమా వల్లే మారుతి, దిల్‌రాజుల బ్రాండ్‌కీ బ్యాండ్ పడిపోయిందన్న టాక్ వినిపించింది. అయినా సరే, ఈసినిమాని ఇంకా బతికించుకోవాలన్న ఆశ చావలేదు. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. ప్రమోషన్లతో బూస్టప్ ఇచ్చారు. అది కాస్త వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి. దాంతో కొన్ని వసూళ్లు దక్కించుకొంది. సినిమా విడుదలైన రెండో రోజు 15 నిమిషాల నిడివి గల సన్నివేశాల్ని ట్రిమ్ చేశారు. ఇప్పుడు మరో 15 నిమిషాల సన్నివేశాల్ని కలపడానికి రెడీ అయ్యారు.
ఎడిటింగ్ దశలో సెకండాఫ్‌లో కొన్ని కామెడీ సీన్లను తొలగించాల్సివచ్చింది. ఆ తొలగించిన సీన్లను ఇప్పుడు మళ్లీ జత చేరుస్తున్నారని తెలిసింది. సెకండాఫ్‌లో కామెడీ తగ్గిందన్నది యునానిమస్ స్టేట్మెంట్. అక్కడ కాస్త రిలీఫ్ దొరికితే బాగుండేది అన్న టాక్ వినిపించింది. అందుకే…. మొదట్లో కట్ చేసిన సీన్లను ఇప్పుడు కలుపుతున్నారన్నమాట. ఓ సినిమాకి ఇలా మూడుసార్లు ఎడిటింగ్ జరగడం చాలా అరుదైన విషయమే. ఈ ప్రయత్నం వల్ల రోజులు మారాయి సినిమా జాతకం మారడం కష్టమే అయినా.. ఎవరి తపన వాళ్లది. కానివ్వండి.