రాయలసీమ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. తెలుగు సినిమా ఫ్యాక్షన్ కథ మొత్తం రాయలసీమ నేపథ్యంలో తిరిగింది. కాకపోతే.. రాయలసీమలోని అసలైన ఆత్మని దాదాపుగా ఎవ్వరూ పట్టుకోలేదనే చెప్పాలి. మనం ఇప్పుడు సినిమాల్లో వింటున్న మాండలికం 10 శాతం మాత్రమే. రాయలసీమ మాండలికాన్ని ఉన్నది ఉన్నట్టు వాడితే… అందులో చాలామట్టుకు ఈతరానికి అర్థం కావు. అందుకే.. అంత ధైర్యం చేయలేకపోయారంతా. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ మాత్రం రాయలసీమ మాండలికాన్ని పూర్తి స్థాయిలో చూపించడానికి సిద్ధమైపోయాడు. `అరవింద సమేత వీర రాఘవ` రాయలసీమ నేపథ్యంలో సాగే సినిమా. రాయలసీమ ఎపిసోడ్‌కి ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యం ఉంది. దాదాపు సగం సినిమా రాయలసీమలోనే సాగుతుంది. రాయలసీమలో కనిపించే ప్రతీ పాత్రా అచ్చమైన రాయలసీమ మాండలికమే మాట్లాడుతుంది. ఈ మాండలికంలో డైలాగులు రాయడం త్రివిక్రమ్‌కి కొత్త. కాకపోతే పవన్ కల్యాణ్‌తో `కోబలి` సినిమా తీస్తున్పప్పుడు రాయలసీమ మాండలికంపై చాలా కసరత్తు చేశారు. అదంతా ఇప్పుడు `అరవింద`కు బాగా ఉపయోగపడుతోంది. సీమలో ఫ్యాక్షనిజం ఎలా పుట్టింది? ఓ దశలో ఏ స్థాయిలో ఉంది? ఆ రోజుల్లో ప్రత్యర్థిపై దాడులు ఎలా జరిగేవి? అనే విషయంలో త్రివిక్రమ్ చాలా ఆసక్తికరమైన డేటా సేకరించారు. అలాంటి సన్నివేశాలన్నీ `కోబలి`లో పొందుపరచాలనుకున్నారు. `కోబలి` సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టేయడంతో… ఆ సీన్లు `అరవింద`లో వాడినట్టు తెలుస్తోంది. `అరవింద`లో కొన్ని యాక్షన్ సీన్లు పవన్ `కోబలి` కోసం డిజైన్ చేసుకున్నవే అని సమాచారం. సో.. తెరపై ఎన్టీఆర్ కనిపిస్తున్నా.. పవన్ ఫ్యాన్స్ మాత్రం మనసులో పవన్‌ని ఊహించుకోవొచ్చు.