అర్హత లేదంటూ పథకాలు నిలిపివేసిన వారిలో.. తమ అర్హతను వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వద్ద నిరూపించుకున్న వారికి నేడు సీఎం జగన్ పథకాల నిధులను విడుదల చేయబోతున్నారు. మొత్తంగా రూ. 703 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ మీట నొక్కి జమ చేస్తారు. లబ్దిదారులుదా ౯ లక్షల 30వేల మంది వరకూ ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా మూడున్నర లక్షల మందికి పెన్షన్లు.. అలాగే బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులను కూడా నేడు మంజూరు చేయనున్నారు.
ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో తమకు అందలేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. వారిలో అర్హులను గుర్తించి ఏటా జూన్, డిసెంబర్లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రకారం ఈ ఆరు నెలల కాలంలో పథకాలను పొంద లేకపోయిన వారిని గుర్తించి.. ఆ మేరకు నిధులను వారి ఖాతాలో జమ చేస్తారు. అన్ని రకాల పథకాలు అంటే.. చేయూత, ఆసరా, సున్నావడ్డీ, కాపునేస్తం, వాహనమిత్ర వంటి పథకాల మొత్తం అర్హులైన వారికి అందిస్తారు.
ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నా… కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చాయనో.. ఆధార్‌తో తప్పులు ఉన్నాయనో అనేక మంది పథకాలకు అనర్హులవుతున్నారు. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం… క్షేత్ర స్థాయిలో అర్హులను గుర్తించడానికి ప్రత్యేక కసరత్తు చేసింది. దాని ప్రకారం అర్హులను ఎంపిక చేసింది. నగదు బదిలీ చేస్తోంది.