ఏపీలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సంఖ్య ఈ ఏడాది భారీగా పడిపోయింది. ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా సగానికి సగం మంది తగ్గారు. 2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రస్తుత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కలిపి ఐదున్నర లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారని తేలింది. ప్రభుత్వం అధికారికంగా లెక్కలు విడుదలచేయలేదు. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం అసలు విషయాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. వీటికి కారణం ప్రధానంగా రెండే. ఒకటి పాఠశాలల్ని విలీనం చేయడం.. రెండు ఇంగ్లిష్ మీడియం.
ప్రభుత్వం విద్యా శాఖలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇటీవల పాఠశాలల్ని విలీనం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో దూరాభారం అవడం వల్ల చాలా మంది బడి మానేశారు. మరి కొంత మంది సమీపంలోని ప్రైవేటు స్కూళ్లలో చేరిపోయారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మొత్తం ఇంగ్లిష్ మీడియంను అమలు చేయడం ప్రారంభించింది. చట్ట ప్రకారంగా తెలుగు మీడియా కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ తెలుగు మీడియంను అనధికారికంగా నిలిపివేశారు. ఇంగ్లిష్ మీడియంలోనే బలవంతంగా చేర్పించేశారు. ఈ కారణంగా లక్షల్లో డ్రాపౌట్లు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ స్కూళ్ల మీద … పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. వేల కోట్లతో పథకాలు అమలు చేస్తున్నారు. నాడు – నేడు పేరుతోనూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. కానీ తగ్గితే ప్రభుత్వ కృషి ఫలించనట్లే. నిజానికి విద్యా వ్యవస్థపై ప్రభుత్వ దృక్ఫథంతోనే పొరపాటు ఉంది. స్కూళ్లకు రంగులు వేసి .. రంగుల కుర్చీలుతెచ్చి పెట్టినంత మాత్రాన పిల్లలకు చదువు రాదని.. ముందుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే విధంగా చూడాలి. కానీ ఆ పని చేయలేదు. ట్యాబులిస్తాం.. రంగులేయిస్తాం… అమ్మఒడి ఇస్తాం అని.. చెప్పి మొత్తానికి పేద పిల్లల చదువుపై పెద్ద బండ వేసేశారు.