సాయి దుర్గతేజ్ (సాయిధరమ్ తేజ్) కథానాయకుడిగా ప్రైమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ దర్శకుడు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ చిత్రానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే పేరు పరిశీలనలో వుంది. ఈరోజు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. వరల్డ్ బిల్డింగ్ ని పరిచయం చేస్తూ సాగిన గ్లింప్స్ ఇది. చివర్లో హీరోని వెనుక నుంచి చూపించారు. ఆ కటౌట్ అదిరింది. ఆ మేకొవర్ ఆశ్చర్యపరిచింది. నిన్నా మొన్నటి వరకూ సాయితేజ్ బొద్దుగా కనిపించేవాడు. ఈ సినిమా కోసం బాగా తగ్గాడు. పైగా కండలు పెంచాడు. ఆ కటౌట్, గ్లింప్స్ లోని వాతావరణం చూస్తుంటే ‘ఇది సాయితేజ్ బాహుబలినా’ అనేంత ఆశ్చర్యం వేస్తోంది.
స్వాతంత్ర్యం రాకపూర్వం జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ గ్రామమే సృష్టించారు. యుద్ధ సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉంది. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా గ్లింప్స్ లో రుచి చూపించారు. టైటిల్ ఇంకా ప్రకటించలేదు. దాదాపు రూ.100 కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. సాయితేజ్ కెరీర్లో నిర్మితమవుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే. సెట్స్ కోసమే.. దాదాపుగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. మేకింగ్ లో క్వాలిటీ కనిపిస్తోంది. అయితే ఇది కేవలం వరల్డ్ బిల్డింగ్ ని పరిచయం చేయడం మాత్రమే. టీజర్ వస్తే తప్ప, ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న విషయంలో ఓ క్లూ దొరకదు. ప్రస్తుతానికైతే.. ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తి పెంచింది.