వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చేస్తున్న ఆరోపణల్లో పస ఉందా లేదనే ఆలోచన ఉంటున్నట్టుగా లేదు! కనీసం ఏదో ఒక ఆధారం చూపి ఆరోపించినా వాటికి బలం ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ప్రస్తుతం టీటీడీ అంశం చర్చనీయంగా ఉంది కాబట్టి, దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ నేలమాళిగలో ఉన్న వేంకటేశ్వరుని ఆభరణాలను సీఎం తన ఇంటికి తరలించారని ఆరోపించారు! ఆంధ్రప్రదేశ్ లో సంపద తరిగిపోతోందని గుర్తించారనీ, అందుకే చివరికి ఆలయాల సంపదను కూడా దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
టీటీడీకి సంబంధించిన ఆభరణాలను సింగపూర్ పంపించేశారన్నారు. అంతేకాదు, అమరావతి, హైదరాబాద్ లలోని సీఎం ఇళ్లలో సంపదలు నిల్వ పెట్టారన్నారు. తెలంగాణ పోలీసులనుగానీ, సీబీఐతోగానీ 12 గంటల్లో సోదాలు చేయిస్తే… చంద్రబాబు ఇంట్లో ఉన్న నిధులూ దేవుని ఆభరణాలూ బయటపడతాయన్నారు. ఒకవేళ అలా బయటపడని పక్షంలో మరుక్షణమే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని విజయసాయి సవాల్ చేశారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉంటే దోచుకున్న శ్రీవారి నగలను వెంటనే చంద్రబాబు తిరిగి అప్పగించాలన్నారు.
ఈ ఆరోపణలు అర్థవంతంగా ఉన్నాయా..? నగలు సింగపూర్ వెళ్లాయన్న కన్ఫర్మేషన్ విజయసాయికి ఉంటే… ఆ ఆధారాలు బయటపెట్టి ఆరోపిస్తే బాగుండేది. చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశాననీ, బోనులో నిలబెట్టే వరకూ నిద్రపోనని ఆ మధ్య ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు కూడా పీఎంవోకి వెళ్లి, శ్రీవారి నగలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని ఫిర్యాదు చేసి… కేంద్ర ఆదేశాలతోనే సీబీఐ ఎంక్వయిరీ వేసే ప్రయత్నం చెయ్యొచ్చు కదా! ఎలాగూ కేంద్రం కూడా ఏపీ సీఎం మీద ఏదో ఒక కోణం నుంచి దర్యాప్తు ఆదేశాలు ఇవ్వాలనే కుట్రతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కదా!
ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేయడమే తప్ప… ఆ క్రమంలో చేస్తున్న ఆరోపణలూ విమర్శలు ప్రజలు హర్షించేవిగా ఉన్నాయా లేవా అనే విచక్షణ వారికి ఉండటం లేదు. ఇంకోటీ.. తన ఎంపీ పదవికి రాజీనామా అంటూ ఇప్పుడు విజయసాయి సవాల్ చేశారు! అది మరీ హాస్యాస్పదంగా ఉంది. ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పదవులను త్యాగాలు చేశారంటూ జగన్ ప్రకటించినా… అది విజయసాయి రెడ్డికి వర్తించని త్యాగంగా మిగిలిపోయింది. ఆయన చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే అర్థమౌతోంది. ఇప్పుడు కూడా.. ఈ సవాల్ ను ఎవ్వరూ తీవ్రంగా తీసుకునే పరిస్థితి ఉండదు. ఆ విషయం విజయసాయికి తెలుసు కాబట్టి.. రాజీనామా చేసేస్తా అంటూ సవాల్ చేస్తున్నారు.