వల్లభనేని వంశీ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనను ఏ -71గా చేర్చారు. ఈ కేసులో పదిహేను మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అంటే.. ఏ -71 కూడా పరారీలో ఉన్నట్లే అర్థం. అయన ఎక్కడ ఉన్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన విజయవాడలో కనిపించలేదని.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మాయమయ్యారని అంటున్నారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఇంటిపై ఓ సారి టీడీపీ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు టీడీపీ నేతల్ని కంట్రోల్ చేశారు. ఆ రోజు రాత్రే ఆయన విజయవాడ నుంచి వెళ్లిపోయారని ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియదని చెబుతున్నారు. వంశీ హైదరాబాద్ లో ఉంటున్నా ఎవరికీ అందుబాటులో లేరని చెబుతున్నారు. ఆయన కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసే కాదు.. ఆయనపై పలు కేసులు రెడీగా ఉన్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించేలా చేసి.. తన అనుచరుడి బార్ కు లబ్ది చేకూర్చేలా చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అలాగే మట్టి తవ్వకాలు సహా చాలా అక్రమాల కేసులు వంశీ కోసం ఎదురు చూస్తున్నాయంటున్నారు. ఇలా జరుగుతుందని తెలిసే.. వంశీ ఆజ్ఞాతంలోకి వెళ్లారని.. పోలీసులు సీరియస్ గా తీసుకుంటే పట్టుకొచ్చేసే అవకాశం ఉంది.