దుష్ట చతుష్టయంగా సీఎం జగన్ అభివర్ణించే వారిలో ఒకరైన రామోజీరావు వ్యాపారాలపై ఏపీ అధికారులు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి ఆఫీసులలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క మార్గదర్శి విషయంలోనే కాదని.. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలపై దాడులు చేస్తున్నామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. మార్గదర్శిల్లో ఇతర చోట్ల సోదాలు జరుగుతున్న సమాచారం బయటకు రాలేదు.
చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. దానితో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే మార్గదర్శి డిపాజిట్ల విషయంలో ప్రభుత్వం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది. రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలపై గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రామోజీ రావుపై ఉన్న నేరాభియోగాలను కొట్టి వేస్తూ 2018 డిసెంబరు 31న ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్ని పిటిషన్లపై తదుపరి విచారణను డిసెంబరు రెండో తేదీన జరగనుంది. ఈ లోపే ఏపీలోని మార్గదర్శి ఆఫీసుల్లో సోదాలు నిర్వహించడం రాజకీయంగానూ చర్చనీయాంశమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించేందుకు అవసరమైన సమాచారం కోసం.. ఇలా సోదాలు చేస్తున్నారని .. భావిస్తున్నారు. సోదాలన్నీ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.