ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఇంటర్యూలు “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” సీజన్ త్రీని ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. మొదటి ఇంటర్యూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో చేస్తున్నారు. ఈ ఆదివారం ఆ ఇంటర్యూ ప్రసారం కానుంది. వైఎస్ కుటుంబం మొదటి నుంచి వేమూరి రాధాకృష్ణను బద్దశత్రువుగా చూస్తుంది. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో మారిన పరిస్థితుల నేపధ్యంలో షర్మిల నేరుగా ఏబీఎన్ స్టూడియోకి వెళ్లి మరీ ఇంటర్యూ ఇచ్చారు.
ఏబీఎన్‌లో గతంలో ఓహెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో ఆ ఇంటర్యూలు వారాంతాల్లో ప్రసారమయ్యేవి. మొదట్లో వివాదాస్పద ప్రశ్నలతో ఆ ప్రోగ్రాంకు ఆర్కే మంచి క్రేజ్ తెచ్చి పెట్టారు. సెలబ్రిటీలను బట్టి డిగ్నిటీ మెయిన్‌టెయిన్ చేసేవారు. దాదాపుగా అందర్నీ ఇంటర్యూ చేసేసిన తర్వతా సరైన సెలబ్రిటీల్లేక ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా దూసుకొచ్చిన సెలబ్రిటీలతో ఇంటర్యూలు ప్లాన్ చేస్తున్నారు.
రాధాకృష్ణతో ఇంటర్యూ అంటే… షర్మిల కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వైఎస్ కుటుంబంలో విబేధాలు ఉన్నాయని చెప్పేందుకు ఆయన ఈ ఇంటర్యూను ఉపయోగించుకుంటారు. అయితే షర్మిల మొత్తంగా రాజకీయ నేతగా మారారు కాబట్టి.. ఆమె ఎలాంటి ప్రొజెక్షన్ కోరుకుంటుందో..,. అదే ఇంటర్యూలో వెల్లడించే అవకాశం ఉంది. కుటుంబంలో గొడవలు ఉన్నాయని బయట పెట్టాలనుకుంటే పెడతారని అంటున్నారు. షర్మిల ఇప్పటికే కొన్ని ఇతర తెలంగాణ చానళ్లకూ ఇంటర్యూలు ఇచ్చారు.