తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు స్వయంగా పవన్ కల్యాణ్ తో ఆయన ఇంట్లో సమావేశం అయ్యారు. సంక్రాంతి నాటికి అభ్యర్థులతో ఇరు పార్టీలకు చెందిన జాబితాను ఒకే సారి ప్రకటించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం పోటీ చేయాల్సిన స్థానాలు, అభ్యర్థులతో సహా మొత్తం ఓ కొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి సమావేశం అయ్యారు.
వైసీపీకి లీకుల్లేకుండా నేరుగా అధినేతల డీల్
వైసీపీ, టీడీపీ మధ్య పొత్తులు చెడగొట్టడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. తమ మధ్య జరిగే సీట్ల సర్దుబాటు చర్చలు బయటకు తెలిస్తే.. మరింతగా రెచ్చిపోతారని.. అపోహలు సృష్టిస్తారన్న క్లారిటీ ఉండటంతో సీట్ల సర్దుబాటు చర్చలు తమ మధ్యే ఉండాలని చంద్రబాబు, పవన్ డిసైడయ్యారు. దానికి తగ్గట్లుగా కొంతకాలంగా వారే వివిధ సర్వే రిపోర్టులతో.. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తే గెలుస్తామో అన్నది పక్కాగా లెక్కలు వేసుకున్న తర్వాత సీట్లు ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
గెలుపే ప్రాతిపదికగా సీట్ల సర్దుబాటు
రెండు పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న లెక్క కాదని.. ఫలితాల తర్వాత ఎన్ని చోట్ల విజయం సాధించామన్నదే ముఖ్యమని భావిస్తున్నాయి. పట్టుదలకు పోయి సంఖ్య కోసం అత్యధిక స్థానాల్లో పోటీ చేసి.. వైసీపీకి చాన్సిన్వడం కన్నా.., పొత్తులు ఎలా వర్కవుట్ అవుతాయో.. అలాగే చేయడం మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారని వైసీపీ నుంచి వచ్చే విమర్శలు.. తమను రెచ్చగొట్టడానికేనని జనసేన అగ్రనేతలకు బాగా తెలుసని.. అందుకే ఈ విషయంలో… తమ సీట్ల సర్దుబాటు చర్చలు గురించి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.
సంక్రాంతికి అభ్యర్థులతో సహా కూటమి జాబితా
సంక్రాంతి పండగ నాటికి రాష్ట్రంలో అన్ని స్థానాలకు టీడీపీ, జనసేన అభ్యర్థులతో జాబితా ప్రకటించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో చెప్పారు. ఒక వేళ మార్చిలో వచ్చినా కాస్త ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల .. నియోజకవర్గాల్లో వారు సన్నాహాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చంద్రబాబు, పవన్ , లోకేష్ జోరుగా ప్రచారం చేసే వెసులుబాటు ఉంటుంది.
టీడీపీ, జనసేన అధినేతలు రాజకీయ వ్యూహాలు లీక్ కాకుండా.. తమ స్థాయిలోనే చర్చలు జరిపి ఫైనల్ చేసుకుంటున్నారు. విబేధిస్తే నిర్మోహమాటంగా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. వైసీపీ ట్రాప్ లో పడకుండా పక్కాగా వ్యవహరిస్తున్నారు.