ఏపీలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపైనే అన్ని పార్టీలూ దృష్టి పెట్టాయి. ఈ జిల్లాలో అధిక స్థానాలు సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందనే సెంటిమెంట్ కూడా పార్టీల్లో ఎక్కువగా ఉంది. దీంతో, ‘తూర్పు’లో ఎక్కువ స్థానాలు సాధించేందుకు పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఎక్కువ స్థానాలను జనసేన పార్టీ ఇక్కడి నుంచే ఆశిస్తోంది. 2019 ఎన్నికల్లో అత్యధికంగా 14 శాతం ఓట్లు ఆ పార్టీకి ఈ జిల్లాలో వచ్చాయి. ఈసారి కూడా ఆ పార్టీ ‘తూర్పు’పైనే ఆశలు పెట్టుకుంది.
గతంలో జనసేన పార్టీకి దక్కిన ఏకైక స్థానం రాజోలు సైతం ఈ జిల్లా కావడంతో, ఈసారి దానికి తోడు మరిన్ని సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. దానికనుగుణంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దాదాపు అర డజనకుపైగా సీట్లను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కేటాయించాలని టిడిపి ముందు ప్రతిపాదించినట్టు ప్రచారం సాగుతోంది. రాజోలు, రాజానగరం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వీటికి తోడు కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్, ముమ్మిడివరం వంటి సీట్లు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. కొత్తపేట, రామచంద్రాపురం వంటి స్థానాల్లోనూ జనసేన పార్టీ ఆశావహులు పని చేసుకుంటున్నారు.
జనసేన అడుగుతున్న స్థానాల్లో టిడిపికీ బలమైన అభ్యర్థులు ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ స్థానాన్ని వదిలే ప్రసక్తి లేదని చెబుతున్నారు. పిఠాపురం మాజీ ఎంఎల్ఎ ఎస్విఎస్ఎన్.వర్మ చురుగ్గా ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ సీటు జనసేన పార్టీకి కేటాయిస్తే గతంలో మాదిరిగా వర్మ రెబల్‌గా బరిలో దిగే అవకాశమూ లేకపోలేదు. ముమ్మిడివరం టిడిపి నుంచి మాజీ ఎంఎల్ఎ దాట్ల బుచ్చిబాబు పోటీకి రెడీగా ఉన్నారు. జనసేన కూడా గట్టిగా పట్టుబడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో సీట్ల సర్దుబాటు కూటమికి క్లిష్టంగా మారుతోందన్న అంచనాలు ఉన్నాయి.