ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తనదైన మార్క్ వేస్తున్నారు. సమస్య తన దృష్టికి రాగానే వేగంగా స్పందిస్తున్నారు. లోకేష్ సత్వర చొరవ 25మంది ఏపీ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కారణమైంది.
జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో జాతీయ స్థాయి విద్యా సంస్థలో ఏపీకి చెందిన పలువురు దివ్యాంగ విద్యార్థులకు సీటు దక్కింది. కానీ, ఐఐటీ మాద్రాస్ కొత్త నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి. దీంతో వారు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వేగంగా స్పందించారు. మద్రాస్ ఐఐటీ పేర్కొన్న విధంగా మెమోలను సవరించి ఇవ్వడమే కాకుండా, జీవోను సైతం జారీ చేయించడంతో 25మంది విద్యార్థులు జాతీయ స్థాయి విద్యా సంస్థలో ప్రవేశం పొందనున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం..దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒక దానికి మినహాయింపు ఉంది. దానికి ‘ఎగ్జంప్షన్’ ఇ అని పేర్కొంటూ మెమోలను జారీ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం జోసా కౌన్సిలింగ్ పర్యవేక్షిస్తోన్న ఐఐటీ మద్రాస్ రూల్స్ మార్చింది. ఇంటర్ లో ఐదు సబ్జెక్టులకు సంబంధించి మెమోలు ఇవ్వాలని ఆదేశించింది. కానీ, ఇంటర్మీడియట్ బోర్డు పాత పద్దతిలోనే మెమోలను ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన చెందారు.
జాతీయ స్థాయి విద్యా సంస్థలో సీటు దక్కినా రాష్ట్ర ఇంటర్మీడియట్ వ్యవహారం తమ ఆశలపై నీళ్లు చల్లిందని టెన్షన్ పడ్డారు. ఓ స్టూడెంట్ తండ్రి వాట్సాప్ ద్వారా ఈ విషయాన్ని నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళగా.. ఆయన వేగంగా స్పందించారు. దివ్యాంగ విద్యార్థుల మెమోలను మార్చడమే కాకుండా, మద్రాస్ ఐఐటీ పేర్కొన్నట్లుగా జీవో కూడా జారీ చేయించడంలో సత్వర చొరవ చూపించారు. దీంతో ఏపీకి చెందిన 25 మందికి జాతీయ విద్యా సంస్థలో సీట్లు దక్కడంతో వారంతా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.