తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? లేదా? ఇది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల ముందున్న మిలియన్ డాలర్ ప్రశ్న. సెక్షన్ 170 ప్రకారం 2026 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదన్నది రాజ్యాంగం నిర్దేశిస్తున్న సంగతి. అయితే విభజనచట్టంలో సీట్ల పెంపు అంశం ఉందన్నది పార్టీల మాట. 2019 ఎన్నికల్లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లు పెరుగుతాయంటూ.. అదే ఆశగాచూపిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎడాపెడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యే స్థాయి నాయకుల్ని విచ్చలవిడిగా తమలో కలిపేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ.. సీట్ల పెంపునకు అడ్డుపడుతూ.. ఆ నిర్ణయం తీసుకోవద్దని కేంద్రానికి లేఖ రాసిందనే వార్తల నేపథ్యంలో.. అసలు రెండు రాష్ట్రాల్లో ఇది సాధ్యమేనా అనే చర్చ తెర మీదకు వస్తున్నది.
విభజన చట్టంలో ఉన్నది గనుక.. రెండు తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా పరిగణించి సీట్లు పెంచాలంటూ ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కేంద్రంతో చర్చించి ముందుకు తీసుకువెళ్తున్నా అంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా చాలా సార్లు తెలుగు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. ఇటీవల ప్రారంభమైన రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ముందు పెట్టేస్తాం అని కూడా వెంకయ్య ప్రగల్భాలు పలికారు.
కానీ, తాజా పరిణామాల్లో అసలు సీట్ల పెంపు వద్దనే వద్దని, అధికార పార్టీలు వక్రప్రయోజనాలతో ఉన్నాయంటూ టీబీజేపీ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెరాసకు అనుచిత ప్రయోజనాలు దక్కకుండా.. సీట్ల తక్షణ పెంపు అనే వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నది. విభజన చట్టం రూపకల్పనలో కీలకంగా ఉన్న అప్పటి మంత్రి జైరాం రమేశ్ ఇప్పుడు పెంపు కరెక్టు కాదంటూ వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పెంపు అంశాన్ని భాజపా పార్లమెంటు ముందుకు తెస్తే గనుక.. కాంగ్రెస్ దానిని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చినా.. రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా విడిగా బిల్లుపెట్టి సీట్ల పెంపు చేయాలని భాజపా సర్కారు తలచుకున్నా.. దానికి కాంగ్రెస్ పార్టీ సహకరించే పరిస్థితి ఇప్పుడు లేదని జైరాం రమేష్ మాటల ద్వారా తేలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహకారం లేకుండా బిల్లు నెగ్గడం, సీట్ల పెంపు జరగడం అనేది కల్లో మాట. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తమకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని తెలిసీ, తాము నష్టపోతున్నామని తెలిసీ కాంగ్రెస్ దీనికి సహకరిస్తుందని అనుకోవడం కూడా కల్లో మాట. కనుక ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది సాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.