ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొత్త నోటిఫికేషన్ లేదని.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇలా చేసినందున… విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏకగ్రీవాల విషయంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని.. ఎస్ఈసీ నిమ్మగడ్డ స్వయంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు అదే విషయాన్ని ఎత్తి చూపుతూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. మార్చి పధ్నాలుగో తేదీ నుంచి పరిషత్ ఎన్నికలు జరపాలనుకుంటున్న నిమ్మగడ్డ.. పురపాలక ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే ఏకగ్రీవాల విషయంలో ఓ ప్రకటన చేశారు. నామినేషన్ల విషయంలో అవకతవకలు జరిగిన చోట ఫిర్యాదులు చేస్తే నామినేషన్లకు చాన్సిస్తామని ఆయన ప్రకటించారు.
నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. బెదిరించడం లాంటి ఘటనలు జరిగిన చోట వారికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే.. మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామని ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని.. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ తన ఆదేశాల్లో చెప్పుకొచ్చింది. గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు,.. పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలన్న ఎస్ఈసీ సూచించింది. ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నని ఆఫర్ ఇచ్చింది.
ప్రభుత్వంతో రాజీపడిపోయి ఎన్నికల నిర్వహణలోనూ… ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తున్నారని విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. బెదిరింపులు, దాడుల వల్ల నామినేషన్లు వేయని వారు.. ఇప్పుడు ఎలా ఫిర్యాదులు చేస్తారని .. రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. అఖిలపక్ష పార్టీ భేటీలోనూ ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరాయి. కానీ నిమ్మగడ్డ మాత్రం.. ఇప్పుడు… కొత్త నోటిఫికేషన్ గురించి మర్చిపోయి… ఆగిన చోట నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.