మున్సిపల్ ఎన్నికల ప్రక్రియతను గతంలో ఎక్కడ ఆపారో అక్కడి నుంచే కొనసాగించాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో .. నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికల్లో ఎవరైనా బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఫిర్యాదు చేస్తే.. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్క్రూటినీ ఆమోదం పొందిన అభ్యర్థులు బలవంతంగా విత్ డ్రా అయితే.. ఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చన్న ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉత్తర్వుల్లో ఎస్ఈసీ పేర్కొంది.
మున్సిపల్ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున నామినేషన్లు వేయనివ్వకపోవడం.. వేసిన వారిని బెదిరించి ఉపసంహరించుకునేలా చేయడం వంటి ఘటనలు జరిగాయి. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. స్వయంగా ఎస్ఈసీ రమేష్ కుమార్ కూడా.. ఈ అంశాన్ని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. చిత్తూరు, కడప జిల్లాలతో పాటు గుంటూరులోని మాచర్ల మున్సిపాల్టీలో అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. అక్కడ పట్ట పగలు… టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. దీనిపై పోలీసులు పట్టించుకోకపోడంతో భద్రతా భయం ఏర్పడింది.
దాడులు దౌర్జన్యాలతో మున్సిపాల్టీని కూడా ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ పరిణామాల మధ్య… వాటి గురించి ఏ మాత్రం ఆలోచించని ఎస్ఈసీ .. ఎన్నికలు ఎక్కడ ఆపేశామో.. అక్కడ్నుంచే ప్రారంభిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తీవ్రమైన విమర్శలు రావడంతో ఇప్పుడు..అలాంటి వాటిపై ఫిర్యాదులు వస్తే పరిశీలించాలని సర్క్యూలర్ ఇచ్చారు. కానీ నామినేషన్లు వేసేందుకు రెండు రోజులు గడువు ఇవ్వాలని ఇతర పార్టీలు కోరుతున్నాయి.