ప్రభుత్వం – ఎస్ఈసీ మధ్య జరుగుతున్న టగ్ ఆఫ్ వార్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై భారీ కుట్ర జరిగిందని.. అత్యంత రహస్యమైన సమాచారం లీక్ అయిందని… గవర్నర్ ముఖ్యకార్యదర్శితో పాటు చీఫ్ సెక్రటరీపైనా సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ… ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలోనే ప్రతివాదులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చేర్చారు. గవర్నర్‌కు ఎస్ఈసీ రాసిన కాన్ఫిడెన్షియల్ లేఖలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అవి రాజ్ భవన్ నుంచి లీక్ అయ్యాయని… ఎస్ఈసీ చెబుతున్నారు. ఈ కుట్ర తేలాలంటే ఖచ్చితంగా సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన కోరుతున్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే వేరే బెంచ్‌కు బదిలీ చేయడంతో విచారణ ఆలస్యం అవుతోంది.
బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి … తమ హక్కులకు భంగం కలిగించారంటూ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. అందులో వారు చెప్పిన కారణం… గవర్నర్‌కు తమపై లేనిపోని ఆరోపణలతో లేఖలు రాశారని చెప్పడం. అయితే ఆ లేఖలేమిటో ఎస్ఈసీ విడుదల చేయలేదు. ఆయన తాను మంత్రులపై ఫిర్యాదు చేశానని కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే ఆ లేఖలు సోషల్ మీడియాలో వైసీపీ పేజీల్లో ప్రత్యక్షమయ్యాయి. గవర్నర్‌కు తాను కాన్ఫిడెన్షియల్‌గా రాసిన లేఖలు అలా సోషల్ మీడియాలో రావడం… కుట్ర పూరితమని.. నిమ్మగడ్డ భావిస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిన సమాధానంలోనూ ఆయన వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. తాను సభ్యుల హక్కులకు భంగం కలిగించినట్లుగా ఆధారాలుంటే చూపించాలన్నారు. ఇప్పుడు… ఆ ఆధారాలను చూపించలేని పరిస్థితి.ఎందుకంటే అవి కాన్ఫిడెన్షియల్. గవర్నర్ ఆఫీస్ నుంచి లీకయినట్లుగా స్పష్టమవుతుంది. అలా అయితే.. అటు గవర్నర్ ముఖ్య కార్యదర్శి.. ఇటు సీఎస్ ఇద్దరూ ఇరుక్కుపోతారు.
నిమ్మగడ్డ సెలవు పెట్టకుండా చేయడానికి ప్రివిలేజ్ కమిటీ నోటీసుల్ని అస్త్రంగా ప్రయోగించిన అధికార పార్టీ.. తన ప్రచార వ్యూహంలో భాగంగా ఎస్ఈసీ లేఖల్ని కూడా… సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కడే పెద్ద చిక్కు వచ్చి పడినట్లయింది. అయితే హైకోర్టు ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీఐడీ లాంటి సంస్థలు బాధితుల్లేకుండా ధర్డ్ పార్టీ వ్యక్తులు చేసే ఫిర్యాదులపై స్పందిస్తూ.. మాజీ ముఖ్యమంత్రిపై కూడా కేసులు పెడుతూంటాయి. కానీ.. ఇతరులు నేరుగా అన్యాయం జరిగిందని వెళ్లినా పట్టించుకోరన్న అభియోగాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డ సీఐడీని ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ …పిటిషన్ పై విచారణకు ఆదేశిస్తే సంచలనం అవుతుంది. ఎందుకంటే ఆ లీకుల్లో… రాజ్‌భవన్ తో పాటు ఏపీ సీఎస్ కూడా భాగమవుతారు. సీబీఐ సీరియస్‌గా విచారణ చేస్తే.. ఇదో పెను సంచలనం అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. అయితే… ఆయన రిటైరైన తర్వాత ఇలాంటివేమీ ఉండవని నమ్ముతున్నారు.