విజయవాడ నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించడంలో ఏపీ సర్కార్ పోటీ పడుతోంది. అక్కడ ప్రభుత్వ కార్యాలయం అనేది కనిపించకూడదన్నట్లుగా చూస్తోంది. అయితే విశాఖ లేకపోతే.. పులివెందుల అన్నట్లుగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. మెట్రో రైలు ఆఫీసుతో పాటు… అనేక కార్యాలయాలను విశాఖకు తరలిస్తూ.. ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. తాజాగా..వెటర్నరీ, బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను.. కడప జిల్లా పులివెందులకు తరలిస్తూ జీవో ఇచ్చేసింది. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారని..అందుకే తరలిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంకిపాడులో ఈ సంస్థ ఉంది. శాశ్వత భవన నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి.
అయితే మొత్తాన్ని నిలిపివేసి… పులివెందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంస్థ కోసం పులివెందులలో 30 వేల చదరపు గజాల్లో నిర్మాణాలు చేపట్టాలని అలాగే.. ఉద్యోగులకు పులివెందులలో క్వార్టర్స్ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖతో పాటు పులివెందులకూ పంచుతూండటంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొదటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అయితే.. రెండోది పులివెందుల అని… అధికారికంగా చెప్పకపోయినా.. అదే జరుగుతోందని అంటున్నారు. త్వరలో మరికొన్ని సంస్థలను కూడా పులివెందులకు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో ఎవరైనా పెట్టుబడులకో.. లేకపోతే.. పరిశ్రమ విస్తరకో వస్తే వారికి పులివెందుల మాత్రమే చూపిస్తున్నారు.
తిరుపతిలో డిక్సన్ అనే సంస్థ ఉంది. పులివెందులలో పెట్టుబడులకు ఆ సంస్థను ఒప్పించారు. అలాగే సర్కార్ ప్రకటించిన రెండు, మూడు రకాల పెట్టుబడులన్నీ.. పులివెందులలోనే ఉన్నాయి. ఇతర చోట్ల ఒక్క రూపాయి కూడా పెట్టుబడి ప్రతిపాదన లేదు. ఆ పెట్టుబడులు ప్రకటించి రోజులు గడుస్తున్నా.. స్పందన లేదు. కానీ.. ప్రాధాన్యం మాత్రం పులివెందులకే దక్కుతోంది.