అంతర్డాతీయ టెక్ దిగ్గజాలు అమెరికా తర్వాత తమ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. గూగుల్ అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లోనే నిర్మించనుంది. 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. ఈ క్యాంపస్‌కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని ..ఇంతకు ముందు చేసుకున్న ఎంవోయూలు గొప్ప కార్యక్రమాలకు దారి తీశాయని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మక కంపెనీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ తమ డేటాసెంటర్‌ను నిర్మించనున్నట్లుగా ప్రకటించింది. 15 ఏళ్ల కాలంలో ఈ డేటా సెంటర్ అభివృద్ధికి గానూ..రూ.15,000 కోట్ల రూపాయలు సంస్థ పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న డేటా సెంటర్ ను మరింత విస్తరించనుంది. ఇప్పటికే అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
నిన్నామొన్నటిదాకా ఐటీ కంపెనీల మొదటి ప్రిఫరెన్స్ బెంగళూరు ఉండేది. కానీ ఇప్పుడుఎక్కువగా హైదరాబాద్‌కు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం.. కరెంట్ సమస్యలు లేకపోవడం..ప్రభుత్వం సహకరిస్తూండటం కారణంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి.