మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు పూడ్చలేనిది. చివర్లో ఆయన పాటలు పాడటం తగ్గించేసిన్నప్పటికీ ఆయన తప్పా మరో గాయకుడు వద్దు అనుకునే పాటలు, సందర్భాలు అనేకం. అయితే ఇప్పుడా ఆయన లేని లోటు తనయుడు ఎస్పీ చరణ్ రూపంలో కొంత తీరుతుంది. నిజానికి చరణ్ పై బాలు ప్రభావం చాలా వుంది. చరణ్ పాడితే బాలులానే ఉంటుందని ఆయనపై ఒక విమర్శ వుండేది. అయితే అదే ఆయన లోటుని తీర్చడానికి ఒక వరం అయ్యింది. బాలు చేసిన పాడుతాతీయగా చరణ్ చేస్తున్నారు. అలాగే బాలు వెళ్ళాల్సిన పాటలు చరణ్ కి వెళుతున్నాయి. తాజాగా హను రాఘవపూడి సీతారామంలో రెండు పాటలు పాడారు చరణ్. తాజా విడుదలైన ‘ఇంతందం’ పాట అచ్చు బాలు పాడినట్లే మనసుని హత్తుకునేలా పాడారు చరణ్. స్వయంగా దర్శకుడే ఈ పాటని బాలు గారిలా పాడండి అని కోరినట్లు తెలిసింది. పాట చాలా అద్భుతంగా వుంది. అచ్చు బాలు వాయిస్ లానే వుంది
ఈ పాటకు మరో ప్రత్యేకత వుంది. దిగ్గజ గేయ రచయిత వేటూరిని కూడా గుర్తు తెచ్చింది ఈ పాట. పాటలో వినిపించిన సాహిత్యం వేటూరి స్టయిల్ లో నే వుంది. స్వయంగా దర్శకుడు హను ఈ మాటని చెప్పారు. ‘ఇది నాకు ఇష్టమైన పాట. గేయ రచయిత కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. ‘చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలైనా, అందం నీ ఇంట చేస్తుందా ఊడిగమే.. అనే ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా అనిపించాయి. వేటూరి గారు గుర్తుకొచ్చారు.” అని చెప్పుకొచ్చారు హను. నిజమే ఇందులో చాలా ఎక్స్ ప్రెషన్స్ వేటూరికి దగ్గరగా వున్నాయి. పాట వినడానికి చూడటానికి చాలా ఆహ్లాదంగా వుంది. మొత్తానికి సీతారామం ఇద్దరు మహానుభావులని గుర్తుకు తెచ్చింది.