చిన్న సినిమాగా వచ్చిన MAD అనూహ్యమైన విజయాన్ని అందుకొంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందించిన ఈ చిత్రానికి కాసుల వర్షం కురిసింది. పాటలన్నీ హిట్టే. భీమ్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పుడు MAD 2 కూడా తయారవుతోంది. ఈ సినిమాలోనూ పాటల్ని హిట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నాడు భీమ్స్. తొలి గీతం `లడ్డుగాని పెళ్లి` మాస్కి బాగా నచ్చేసింది. ఇప్పుడు పార్టీ సాంగ్ కూడా విడుదల చేశారు. ‘జామ చెట్టుకు కాస్తాయ్ జామకాయలూ’ అనే హుక్ లైన్ సోషల్ మీడియాలో మంచి పాపులర్. దాన్నే లీడ్ గా తీసుకొని మంచి మాస్ బీట్ తయారు చేశాడు భీమ్స్. ఈ పాటకు సురేష్ గంగుల సాహిత్యాన్ని అందించారు. భీమ్స్ తో పాటుగా ఈ పాటని స్వాతిరెడ్డి ఆలపించారు. విజయ్ పొలంకి నృత్య రీతులు సమకూర్చారు.
పాటలో మంచి బీట్ ఉంది. మాస్ స్టెప్పులు ఉన్నాయి. డిసెంబరు 31 పార్టీ మూడ్ ని రెట్టింపు చేసే జోష్ ఈ పాటలో ఉంది. రెబా మోనికా ఈ పాటలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ‘సామజవరగమన’ సినిమాతో పాపులర్ అయ్యింది రెబా. ఈ సినిమాలో ఐటెమ్ గాళ్ గా మెరిసింది. సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. తొలి భాగం కాలేజీ స్టోరీ అయితే – ఈ సీక్వెల్ లో ముగ్గురు హీరోల పెళ్లి గోల చూపిస్తున్నారు. గోవా నేపథ్యంలో సినిమా సాగబోతోందని టాక్. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.