మాస్క్ పెట్టుకోవడం అంటే.. కరోనాకు భయపడటం అన్న అభిప్రాయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలను సెకండ్ వేవ్ చుట్టు ముడుతోంది. వారి ద్వారా ఇతర పార్టీల నేతలకూ కరోనా వైరస్ సోకుతోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయనకు రెండో సారి సోకడంతో .. శ్వాస తీసుకోవడం సమస్యగా మారడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. శాసనసభలో కానీ.. మండలిలో కానీ.. వైసీపీ సభ్యులెవరూ.. మాస్క్ పెట్టుకోలేదు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది.
కారుమూరి నాగేశ్వరరావుకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. అంతకు ముందు ఆయన హోంమంత్రి సుచరితతో సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా వ్యవహరించారు. అయినా వారెవరూ.. ఐసోలేషన్‌కు వెళ్లలేదు. తాజాగా.. మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. గత జూలైలో ఆయనకు ఓ సారి పాజిటివ్ గా తేలడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మళ్లీ ఇప్పుడు ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఓ సారి వచ్చి పోయిన వారికి మళ్లీ రాదన్న అభిప్రాయం .. వరుసగా రెండో సారి వస్తున్న వారి ద్వారా పటాపంచలు అవుతోంది.
రెండు రోజుల నుంచి అంబటి రాంబాబు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది. వైసీపీ నేతల నిర్లక్ష్యం వల్ల ఇంకెంత మంది కరోనా బారిన పడి ఉంటారోనన్న ఆందోళన చాలా మందిలో వ్యక్తమవుతోంది. నయమైతే పర్వాలేదు.. కానీ అనుకోని ఘటన ఏదైనా జరిగితే.. మాత్రం పూడ్చలేని నష్టం జరుగుతుంది. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే.. కరోనా నుంచి కోలుకున్నా.. ఇబ్బంది తప్పడం లేదు.