జనవరిలో సంక్రాంతి సినిమాల హడావుడి అయిపోయిన తరవాత ఫిబ్రవరిలో ‘తండేల్’ విడుదల అవుతుంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. చందూ మొండేటి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బుజ్జితల్లి’ పాటకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు రెండో పాట ‘నమోః నమశ్శివాయ’ విడుదల చేశారు. జొన్నవిత్తుల రాసిన పాట ఇది. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు అందించారు. అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు.
వెండి తెరపై చాలా గ్రాండ్ గా ఈ పాటని తీర్చిదిద్దారు. దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ పాట కోసం ఖర్చు పెట్టారు. ఆ క్వాలిటీ తెరపై కనిపిస్తోంది. శివనామ స్మరణతో ఈ పాట.. ఉద్వేగభరితంగా సాగింది. బీట్ లో జోష్ వుంది. పాటగా మొదలై పూనకంగా మారింది. మరీ ముఖ్యంగా కొరియోగ్రఫీ చాలా నీట్ గా అనిపించించింది. సాయి పల్లవి అసలే బెస్ట్ డాన్సర్. ఈ పాటలో తను మరింతగా విజృంభించింది. కొన్ని బీజియమ్స్.. సాయి పల్లవి కోసమే చూడాలనిపించేలా ఆ మూమెంట్స్ తీర్చిదిద్దారు. తొలిసారి నాగచైతన్య కూడా డాన్సుల విషయంలో కష్టపడ్డాడనిపిస్తోంది. తన లుక్స్ బాగున్నాయి. పాటంతా తన ఎనర్జీ కనిపించింది. తండేల్ ఆల్బమ్ లో ‘బుజ్జి తల్లి’ బెస్ట్ పాటగా మిగిలిపోతుందనుకొన్నారు. అయితే ఈ పాటకు ‘నమశ్శివాయ’ గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు.