ప్రభుత్వం విడుదల చేసే జీవోలన్నీ బయిటపెట్టాలా? వెనువెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అవసరమా? ఈ సందేహాలు కలిగింది మరెవరికో కాదు- తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇచ్చే జీవోలు ముందే వెల్లడికావడంతో కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని ఆయనకు సందేహం వచ్చినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దాంతో రాజ్యాంగ పరంగా ఇది అవసరమో కాదో విచారించవలసిందిగా ఆదేశాలు ఇచ్చారట. ఈ లోగా యాదృచ్చికమో ఉద్దేశపూర్వకమో గాని ప్రభుత్వ వెబ్సైట్ కూడా మొరాయిస్తున్నట్టు మీడియా పరిశీలకులు చెబుతున్నారు. జీవోలపై ముందే అపార్థాలు పెరగడంతో చాలా సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే సమాచారహక్కు, పారదర్శకత వంటి దృక్పథాలు బలంగా వున్న కాలంలో జీవోలను చూపించకుండా నిగూఢంగా వుండచం సాధ్యమా వాంఛనీయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎపిలో చంద్రబాబు ప్రభుత్వం 830 పైగా జీవోలను విడుదల చేయకుండా రహస్యంగా అట్టిపెట్టిందని ఇప్పటికే విమర్శలున్నాయి. ఇక ఇప్పుడు కెసిఆర్ ఏకంగా ఆ పద్ధతికే ఎసరుపెట్టడం ఆసక్తికరమని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలలో నిరసనకు దారితీసే నిర్ణయాలు చేయదలిస్తే తప్ప ఈ నిగూఢత దేనికని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మీడియాపై తరచూ వెల్లడవుతున్న అసహనంలో భాగమే ఈ నిర్ణయమని కూడా భావిస్తున్నారు.