జెన్యు వివాదంలో ప్రధాన సూత్రధారి సృతి ఇరానీ నాటకీయ దాడితో పార్లమెంటులో రెండవ రోజు కూడా చర్చ దారి తప్పిపోయింది. . ఆమె మొదట రాజ్యసభలో బిఎస్పీ నేత మాయావతితో వాదన పెట్టుకున్నారు. మిమ్మల్ని ఒప్పించలేకపోతే నా తల మీ పాదాల దగ్గర సమర్పిస్తానంటూ ఉద్రేకంగా సవాలు చేశారు. ఆ తర్వాత మరింత తీవ్ర దాడికి లోక్‌సభను రంగస్థలంగా చేసుకున్నారు. ఉద్రేకాలతో వూగిపోయారే తప్ప కొత్తగా వెల్లడించిందేమీ లేదు. జెఎన్‌యు వివాదానికి ఆమె చదివిన తీస్తా సెతల్వాద్ పుస్తకాలకూ సంబంధం కూడా లేదు. బిజెపి పాలిత రాష్ట్రాలలో పాఠ్య పుస్తకాల పైనా ఎన్నొ విమర్శలున్నాయి. అదలా వుంచితే లోక్‌సభలో చదివిన దుర్గాదేవి పోస్టరును ఈ రోజు మరోసారి రాజ్యసభలో చదవబోయి సభ రభసకు వాయిదాకు కారణమైనారు. దుర్గాపూజ బెంగాల్లో ఎక్కువగా జరుగుతుంది గనక రేపటి ఎన్నికల్లో లాభం జరుగుతుందనే ఆశ తోనే ఆమె దేవతను అవమానించారన్న పోస్టరు చదివి వినిపించారు.జెఎన్‌యు విద్యార్థుల పోస్టరులో ఏముందో పూర్తిగా తెలియదు గాని ఆమె పార్లమెంటులో చదివి వినిపించడం ద్వారా లేని ప్రచారం కల్పించారు. విశేషం ఏమంటే బెంగాల్‌లోని కుమార్ తులిలో దుర్గా విగ్రహాలు చేసే కళాకారులు సెక్స్ వర్కర్ల వాడగా పేరొందిన సోనాగచ్చి నుంచి మట్టి తీసుకువస్తారు. ఇది తరతరాలుగా అమలవుతున్న ఆచారం. ‘నిషిధ్ధ పలి’ నుంచి ‘పుణ్యమట్టి’ గా దాన్ని భావిస్తారే గాని చులకనగా చూడరు. ఇందుకు రకరకాల వివరణలు వున్నాయి గాని ఇక్కడ అప్రస్తుతం. ఎవరైనా సరే రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను మతాలను తీసుకురావడం దారుణం. సాక్షాత్తూ శ్రీరాముణ్ని రథంపై ఎన్నికల గుర్తుగా వేసుకుని వూరేగడం దేవుణ్ని దుర్వినియోగం చేయడం కాదా? ఇందువల్ల విద్వేషం పెంచడమే ఉద్దేశమైతే దేశం ఎంత మూల్యం చెల్లించాల్సి వుంటుందో ఆలోచించారా? ఇతర విషయాలు ఎలా వున్నా మహిళా మంత్రి పోస్టరులోని సెక్స్ వర్కర్ పదాన్ని నొక్కి పలుకుతూ చులకన చేయడం చాలా బాధాకరం. వారు మహిళలు కాదా? మాతృమూర్తులుగా గౌరవించాల్సిన పని లేదా? పురాణాల్లో దేవ వేశ్యలుగా ఇంద్రలోకంలోనూ జోగినులు బసవిలు, దేవదాసీల పేరిట సమాజంలోనూ అట్టిపెట్టబడిన వారు గాని ఒక విధంగా సెక్స్‌వర్కర్లు కారా? దుర్గాదేవి మాతృస్వామిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన దేవత. ఆమె అవతారంపై మహిమలపై రకరకాల కథలున్నాయి. మహారాష్ట్రలో ఒక కథ ప్రకారం ఆమె మహిషాసురుణ్ని హతమార్చాక అతను కొత్త రూపంలో వచ్చి ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ఇక బెంగాల్‌లోని అసుర అనే గిరిజన తెగ వారు తాము మహిషాసుర సంతతి అని నమ్ముతారు. వామనుడు అణగదొక్కిన బలిని మళయాలీలు దేవుడుగా పూజిస్తారు. రాక్షసులు దేవతల గురించిన కథలన్నీ అన్నిచోట్లా ఒకేలా వుండవు. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యం ప్రకారమే చూసినా శివుడి వరాల వల్ల చావు లేకుండా చేసుకున్న మహిషుణ్ని వధించడానికి త్రిమూర్తులు తమ శక్తులు ధారపోసి దుర్గను తయారు చేస్తారు. ఆమె మహత్తర సౌందర్యంతో ఆయుధధారియై పులిమీద వచ్చి యుద్ధానికి పిలుస్తుంది. మహిషుడి సైనికులు ఒక అప్సరస మీ కోసం వచ్చిందని అతనితో చెబితే యుద్ధానికి దిగి ఆమె చేతిలో హతమవుతాడు. మహిషాసురిడి పేరుమీదనే మైసూరు ఏర్పడిందని చెబుతారు. అక్కడి చాముండేశ్వరి ఆలయంలో మహిషాసురుడి విగ్రహం వుంటుంది. మహిష అతని చెల్లెలు అంటూ ఆమెకు కూడా ఒక చోట గుడి కట్టారు. “ఏమంటివి ఏమంటివి.. అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టికుండలో పుట్టితివి కదా నీది ఏ కులము?” అని ఎన్టీఆర్ డైలాగులు తెలుగు లోగిళ్లలో మార్మోగుతుంటాయి కదా. సృతి ఇరానీ చెప్పే ప్రకారమైతే వినేవారు గాని చెప్పేవారు గాని భారతాన్ని అవమానించినట్టా? ఎన్టీఆర్ కన్నా పౌరాణిక బ్రహ్మలు ఎవరుంటారు ? కాబట్టి సమయం సందర్భం లేకుండా మతాన్ని దేవతలను అవమానించారనీ, దేశానికి ద్రోహం చేశారని ఆరోపణలు గుప్పించడం దేశంలో ద్వేషాలు పెంచడానికి తప్ప దేశభక్తికి తోడ్పడదు. సుప్రీం కోర్టులో వందేమాతరం పాడితే న్యాయమూర్తి మందలించడమే ఇందుకో ఉదాహరణ. దేశభక్తి ఎవరికైనా గుండెల్లో వుంటుంది కాని కేవలం జెండాల్లో కాదని తెలుసుకోవాలి. ఈ విధమైన వ్యాఖ్యల వల్లే రాజ్‌దీప్ సర్దేశాయి, బర్ఖాదత్ సహా ఎంతోమంది “మేము మీ కితాబులు తీసుకోవడం కంటే దేశద్రోహులం అనిపించుకోవడానికే ఇస్టపడతామని” ప్రకటించారు. దారితప్పిన ఉగ్రవాదులనే నచ్చజెప్పి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తాం. ఆవేశంలోనో అంచనా తప్పడం వల్లనో ఎటు నుంచి ఏ పొరబాటు జరిగినా సర్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణం. అందరినీ కలుపునికోవడం అధికారంలో వున్నవారి బాధ్యత. యువతరంపైన, ప్రత్యేకించి అణగారిన తరగతులపైన సానుభూతి లేకుండా రాజకీయ వ్యూహాలతో విద్రోహాలు అంటగట్టడం అనర్థదాయకమని గ్రహిస్తారా ‘బహు’ మేడం? మౌనం వీడతారా ప్రధాని గారూ?