రాజకీయాలలో కుట్ర సిద్ధాంతాలు హఠాత్తుగా వినిపించి ఠక్కున ఆగిపోవడం జరుగుతుంటుంది..దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కేంద్రంలో స్వంత ఆధిక్యతతో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ తనను కూల్చే కుట్ర జరగుతుందంటారు. తెలంగాణ సాధన సమరానికి సారథిగా టిఆర్ఎస్ ప్రభుత్వ సారథ్యం చేపట్టిన కెసిఆర్ తమపై మొదట్లోనే కుట్ర జరిగిందంటారు. తన హయాంలో అభివృద్ధి జరుగకుండా అడ్డుకోవడానికి ప్రతిపక్షం కుట్ర చేస్తున్నదని నవ్యాంధ్ర ప్రదేశ్ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తారు. ఇది గాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం కుట్ర ఆరోపణలు చేసుకుంటారు. మళ్లీ ఆ అధినాయకులే ఆలింగనాలు చేసుకుంటారు. ఆహ్వానాలు ఇచ్చుకుంటారు. కేంద్ర రాష్ట్రాలు ప్రశంసలు కురిపించుకుంటాయి. రాజకీయ వేదికలపై నేతలు దూషించుకుంటారు. ఈ మతలబులేమిటో సామాన్యులకు ఒకపట్టాన బోధపడక తలపట్టుకుంటారు. తెలంగాణలో తమ పార్టీ 63 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలోగానే కుట్రలు జరిగాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అది కూడా తనకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ద్వారా తెలిసందన్నారు ఈ కుట్రనుంచి తనను ఆదుకోవడానికి ఒవైసీ హామీ ఇచ్చారట. నిజంగా అయితే మజ్లిస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకే వ్యతిరేకం. అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే కెటిఆర్ తొలుదొల్తగా అక్బరుద్దీన్ ఒవైసీని కలుసుకోవడం ఆశ్యర్యం కలిగించింది. అందులోనూ కుట్ర ఏమిటో కెసిఆర్ మాటలతోనే కొంత అర్థమైంది. కాంగ్రెస్ తెలుగుదేశం కలసి చేసిన ఈ కుట్రకు ఢిల్లీ స్థాయిలోనూ సాగిందని ఆయన ఆరోపించారు. దీనిపై టీవీచర్చలలోనూ పత్రికలలోనూ కూడా నేను చాలా ప్రశ్నలు లేవనెత్తాను. ప్రతిపక్షాలూ విమర్శలు చేశాయి. అయితే ఆ రెండోరోజు నుంచి అంతా గప్‌చిప్‌గా వుంది. కెసిఆర్ కాకపోయినా ఆయన సహాయకులైనా కుట్ర వాదనను కొనసాగించింది లేదు. వారి పత్రికలోనూ దానిపై విశ్లేషణలూ విమర్శలు లేవు.
కెసిఆర్ చెప్పిన కుట్ర కథ నిజమే అయితే ఉద్యమ నాయకుడుగా అధికార పీఠం వరకూ విజయయాత్ర చేస్తున్న కెసిఆర్ తన వెనక వున్న శాసనసభ్యులతోనూ ఉద్యమ సంస్థలతోనూ పంచుకోవలసింది. కుట్ర వమ్ము చేయాలని పిలుపునివ్వాల్సింది. పరస్పర వ్యతిరేకులైన కాంగ్రెస్ తెలుగుదేశం బిజెపి కలసి కుట్ర చేసే అవకాశం వుందనడమే ఒక విడ్డూరం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఆదిలోనే రాకుండాచేసేంత అవివేకపు అపరిపక్వపు దుస్సాహసమే చేస్తాయా? పోనీ చేసి వుంటే ప్రజాస్వామిక వాదులందనూ కుట్రకు వ్యతిరేకంగా కెసిఆర్‌ను బలపర్చివుండేవారు. అయితే ఆయన కనీసం తన పార్టీ ఎంఎల్ఎలకు కూడా ఈ సమాచారం చెప్పకపోగా ా ఫిరాయింపులకు స్వాగతించాలని నిర్ణయించుకున్నారు. అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కెరటాలపై తేలివచ్చిన సభ్యులెవరూ తనను వీడిపోరనే నమ్మకం ఆయనకు లేదా? సాధించుకున్న తెలంగాణలో గెలిపించుకున్న తొలి ప్రభుత్వాన్ని కాపాడుకోలేనంత నిస్సహాయులుగా ప్రజలు కనిపించారా? అసదుద్దీన్ ఒవైసీ మాటలతో అభద్రత ఆవరించేసిందా? ్త అశేష ప్రజానీకం తన వెనక వున్నారనే భరోస మటుమాయమైందా?
ఉన్నమాట చెప్పాలంటే ఈ ఫిరాయింపు క్రీడలోనే కుట్రల ఛాయలుఆ పార్టీ వారికే కనిపించాయి. వారిలో కొందరు మాలాటివారితో అలాటి సందేహాలు పంచుకునేవారు కూడా. ఎన్టీఆర్ ఘన విజయం సాధించిన ఏడాదిలోనే నాదెండ్ల భాస్కరరావు ద్వారా కేంద్ర కాంగ్రెస్ కూలగొడితే తెలుగు ప్రజలు ప్రతిపక్షాలన్నీ ఉవ్వెత్తున ఎగిసి పున: ప్రతిష్టించిన సందర్భం వుంది. అదే ఎన్టీఆర్‌ను కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అంతర్గత తిరుగుబాటుతో పడగొట్టిన బృందంలోనూ కెసిఆర్ ముఖ్యులు. ఇందులో రెండవ దాన్ని గురించి ఆందోళన కూడా ఈ ఫిరాయింపుల హౌమం వెనక వుందంటారు. సామూహికంగా అవతలి పార్టీల వారిని తీసుకురావడం అంతర్గత బలాబలాల మార్పునకేనని బలమైన అభిప్రాయం ఏర్పడింది. ఫిరాయించిన వారిని తెచ్చి మంత్రులుగా ప్రతిష్టించడంతో టిఆర్ఎస్ నాయకత్వంలో ప్రభుత్వంలో వరుస క్రమం మారిేపోయింది. కెసిఆర్ కోరుకున్న వారిని అందలమెక్కించి అతికీలకమనుకున్నవారిని అందరిలో ఒకరుగా చేసేయగలిగారు. బంగారు తెలంగాణ గురించి ఆయన చెబుతున్నా రాజకీయంగా ఫిరాయింపుల తెలంగాణగా మారింది. కొత్త రాష్ట్రంలో పాత సంసృతి మారబోదని స్పష్టమైంది. పైగా మీరు సంసారం మేము చేస్తే వ్యభిచారమా అని సవాలు చేయడం ద్వారా మనమంతా ఒకటేనని ఒప్పేసుకున్నట్టయింది. అటు ఆంధ్ర ప్రదేశ్‌లోనూ వైసీపీ వారిని చేర్చుకోవడం బట్టి చూస్తే అభివృద్ది జరగాలంటే అధికార పక్షంలోనే వుండాలనే ఫార్ములా ఏర్పడింది. మరైతే కేంద్రంలోనూ అందరూ బిజెపిలో చేరిపోవాల్సి వుంటుందా?
మొత్తంపైన రాష్ట్ర విభజనతో మారింది సరిహద్దులే గాని పాలక పక్షాల బుద్దులు కాదని రుజువవుతున్నది. రెండుచోట్ల కుబేర వర్గాల ప్రాబల్యం, వందిమాగధుల ప్రాపకం అన్నీ షరామామూలుగానే సాగిపోతున్నాయి. టీడీపీ టిఆర్ఎస్ వైసీపీ కాంగ్రెస్ వంటి తేడాలు లేకుండా ఎక్కడైనా ఇమిడిపోగలుగుతున్నారు. మొదటిసారి సిపిఐ ప్రస్తుత శాసనసభ్యులు కూడా ఒకరు ఫిరాయింపుల జాబితాలో చేరడం ఈసారి ఎక్స్ట్రా. ఆయనను తనకు తానే వచ్చినట్టు ముఖ్యమంత్రి ప్రకటించడం ఇంకా వింతగా వుంది. . ఏమైతేనేం ఈ ఫిరాయింపుల క్రీడను ఏదో విధంగా సమర్థించుకోవలసి వుందని అర్థం కాబట కెసిఆర్ ఒక సంజాయిషీలాగే కుట్ర సిద్ధాంతం ప్రకటించారు.చెప్పారు గనక దాని వివరాలు వెల్లడిస్తే ప్రజలు అవగాహన పెంచుకుంటారు. కుట్ర దారులు బహిర్గతమవుతారు. దాంతోపాటు ఇద్దరు ముఖ్యమంత్రులు పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్న ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు కూడా పూర్తిగా వెల్లడి చేస్తే కొంతలోమరింత స్పష్టత వస్తుంది. .